పెచ్చులూడి పడుతున్న పాఠశాల పైకప్పు – తరగతి గదిలోనూ కుంగిపోతున్న బండలు – భయాందోళనలో నరసాపురం విద్యార్థులు

Sep 27,2024 21:37

పెచ్చులూడుతున్న పాఠశాల భవనం

ప్రజాశక్తి – రుద్రవరం

మండలంలోని నరసాపురం గ్రామంలోని ప్రత్యేక ప్రాథమిక పాఠశాల భవనం పై కప్పు పెచ్చులూడి పడుతున్నాయి. విద్యార్థులు బడికి వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. నరసాపురం గ్రామంలోని దళిత కాలనీలో ప్రాథమిక ప్రత్యేక పాఠశాలను దాదాపు 40 సంవత్సరాల క్రితం పాఠశాలను అధికారులు నిర్మించారు. పాఠశాల ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పాఠశాల తరగతి గదిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువు కూర్చునే కుర్చీలు కూడా కింద బండ పరుపు కుంగిపోవడంతో ఏటవాలుగా ఒరిగి పడుతున్నాయి. ఇక విద్యార్థులు కూర్చునే స్థలాలు పూర్తిగా కుంగుతున్నాయి. తరగతి గదిలో బండ సపట కుంగడంతో పాటు వరండాలోని బండ సపట కుంగి పడుతుంది. దీంతో పాటు పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్నాయి. విద్యార్థులు బడికి వెళ్లాలంటే ఏ క్షణంలో ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు మరమ్మతులు చేపట్టాలని, మెరుగైన సౌకర్యాలను కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుర్రప్ప మాట్లాడుతూ పాఠశాలలో తరగతి గదితో పాటు వరండాలో ఉన్న బండ సపట రోజు రోజుకు కుంగిపోవడం వాస్తవమే అన్నారు. పాఠశాల మరమ్మతుల కోసం సంబంధిత ఉన్నతాధికారులకు నివేదికలను ఇచ్చామన్నారు. నిధులు లేకపోవడంతోనే పాఠశాలలో ఎలాంటి మరమ్మత్తులు చేయలేదన్నారు. ఉన్నతాధికారులు నిధులను ఇస్తే త్వరలోనే పాఠశాలలో మరమ్మతులను చేపడుతామన్నారు.

తాజా వార్తలు

➡️