మిచాంగ్‌ తుపాను దూసుకొస్తోంది : ఐఎండి రెడ్‌ అలర్ట్‌..!

Dec 2,2023 13:52 #approaching, #Cyclone, #IMD, #Red Alert

అమరావతి : మిచాంగ్‌ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ముందుగానే వెల్లడించింది. ఆ తర్వాత వాయుగుండం దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుందని, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. తుపాను ప్రభావంతో ఆదివారం నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు….

నెల్లూరు జిల్లా వైపు మిచాంగ్‌ తుపాను దూసుకొస్తుందన్న ఐఎండి తుపాను హెచ్చరికల నేపథ్యంలో … 4వ తేదీ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ సెలవు ప్రకటించారు. ఆదివారం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లకూడదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంబేద్కర్‌ హెచ్చరించారు.

అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం…

బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కోస్తాంధ్రతోపాటు, రాయలసీమలోనూ పెను ప్రభావం చూపనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి, ఫోన్‌ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసింది.

https://twitter.com/VizagWeather247/status/1730855114041352474

➡️