విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసురత్నం
ప్రజాశక్తి – ఆత్మకూరు
ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సిఐటియు నంద్యాల జిల్లా అధ్యక్షులు వి. యేసురత్నం, సిఐటియు ఆత్మకూరు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రజాక్, రామ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, విద్య, వైద్య, రెవెన్యూ, ఆర్టీసీ శాఖలు, దేవాలయాల్లో అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, డైలీవేజ్, థర్డ్ పార్టీ కాంట్రాక్టు వర్కర్లుగా చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మారినప్పుడల్లా మాకు మంచి రోజులు వస్తాయని కార్మికులు, ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు తప్పా వారి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. కార్మికులందరినీ పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలివ్వాలని, మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.