జాతి నిర్మాతలు ఇంజనీర్లు

Sep 15,2024 22:21

పురస్కార గ్రహీతలతో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు

ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ రవికృష్ణ

ప్రజాశక్తి – నంద్యాల

ఇంజనీర్లు జాతి నిర్మాతలని ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ రవికృష్ణ అన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఆదివారం జాతీయ ఇంజనీర్ల దినోత్సవం నంద్యాల లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక లయన్స్‌ క్లబ్‌ కార్యాలయంలో నిర్వహించారు. లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు నిజాముద్దీన్‌ అధ్యక్షతన పివి సుధాకర్‌ రెడ్డి సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డాక్టర్‌ రవికృష్ణ పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలు వివరించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఈఎస్‌సి పాలిటెక్నిక్‌ కళాశాల సీనియర్‌ అధ్యాపకులు ఉమామహేశ్వరప్ప, జి.వి.రాజశేఖర్‌ రెడ్డిలను సత్కరించి, లయన్స్‌ క్లబ్‌ జాతీయ ఇంజనీర్స్‌ దినోత్సవ పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి శిరిగిరి రమేష్‌, జిల్లా చైర్మన్లు రవి ప్రకాష్‌, చంద్రమోహన్‌, ఉపాధ్యక్షులు కూర ప్రసాద్‌, సోమేశుల నాగరాజు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. బనగానపల్లె రూరల్‌ : మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని సివిల్‌ ఇంజనీర్‌ మక్బూల్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. ఆదివారం బనగానపల్లెలోని బిల్డర్స్‌ కార్యాలయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీర్లకు గుర్తింపుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్‌ డేగా జరుపుకుంటామని తెలిపారు. దేశానికి అతిపెద్ద ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని చెప్పారు. కార్యక్రమంలో ఇంజనీర్‌ మహమ్మద్‌ నయూమ్‌ హుస్సేన్‌, మేస్త్రి షేక్షావలి, షాకీర్‌, జాకీర్‌, బాషా, హమీద్‌, గంగా ఎలక్ట్రికల్‌ యజమాని గంగాధర్‌ రెడ్డి, సతీష్‌, మహబూబ్‌ వల్లి, కట్టర్‌ మబ్బుల్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️