కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

Sep 15,2024 22:18

మినుము పంటలను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు

ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్‌

మినుము పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు, నాయకులు పకీరు సాహెబ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని మల్యాల గ్రామంలో రైతులతో కలిసి ఆదివారం మినుము పంటను పరిశీలించి మాట్లాడారు. భారీ వర్షాలు కురిసినప్పటికీ మినుము పంట ఆశ జనకంగా వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కానీ మినుము కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు పంటను తక్కువ ధరలకు క్వింటా రూ 3,500కు మధ్య దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటకు పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వమే మినుము పంటను క్వింటాకు రూ 10వేలు చెల్లించి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మినుము రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో మినుము రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మినుము పంటను పరిశీలించిన వారిలో రైతులు జయన్న, మధు, శ్రీనివాసులు, చిన్న, రఫీ, రమేష్‌, రవి యాదవ్‌ ఉన్నారు.

➡️