ఐసిడిఎస్ పిడికి వినతి పత్రం ఇస్తున్న అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు
– బియ్యం, సరుకులు సెంటర్‌కు సప్లై చేయాలి
– సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్
అంగన్వాడీ సెంటర్లకు ఇవ్వాల్సిన కరెంటు బిల్లులను తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి. యేసురత్నం, ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శోభారాణి, ఎం. నిర్మల, జిల్లా నాయకులు సునీత, రోజా రమణిలు ఐసిడిఎస్ పిడి నిర్మలను కోరారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్‌్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో ఐసిడిఎస్ పిడి నిర్మలకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు అంగన్వాడీ ఉద్యమం సందర్భంగా సమస్యలు పరిష్కరిస్తామని వాగ్ధానం చేశారని గుర్తు చేశారు. నేటికీ ఆ వైపు చర్యలు తీసుకోవడం లేదని, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అంగన్వాడీ వర్కర్స్‌తో శ్రమ దోపిడీ చేయిస్తున్నారు తప్పా శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వడం లేదన్నారు. రెండేళ్లుగా సెంటర్లకు కరెంటు బిల్లులు ఇవ్వడం లేదని, కూరగాయల బిల్లులు నెలనెలా సక్రమంగా ఇవ్వాలని, ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం, కంది బెడలు, నూనె సెంటర్‌కు సరఫరా చేయకపోవడంతో అదనంగా ఆటో చార్జీలు పెట్టుకొని వర్క్‌ర్సే సెంటర్లకు తీసుకెళ్తున్నారని తెలిపారు. జీవో ప్రకారం ఆయాలకు ప్రమోషన్ ఇవ్వాలన్నారు. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లగా గుర్తించి వేతనాలు పెంచి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటినీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్‌కు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని, ఐసిడిఎస్‌ను బలోపేతం చేసి బడ్జెట్‌ను పెంచాలన్నారు. ప్రభుత్వం ప్రయివేటీకరణ విధానాలు ప్రోత్సహించకుండా ఐసిడిఎస్‌ను ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టేందుకు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సిద్ధంగా ఉండాలని కోరారు.