అధికారులకు వినతి పప్రతం అందజేస్తున్న నాయకులు
ప్రజాశక్తి – నందికొట్కూర్‌నందికొట్కూరు
పట్టణంలోని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాలనీలోని సిపిఎం గుడిసె వాసులకు పట్టాలిచ్చి, కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పి పకీరి సాహెబ్ అధ్యక్షతన సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్‌లో సర్వే నెం. 589, 590, 595లో 15ఏళ్ల నుండి దాదాపు 200 కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయని తెలిపారు. వీరికి పట్టాలిచ్చి పక్కా గృహాలు మంజూరు చేయాలని తమ పార్టీ ఆధ్వర్యంలో అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పది రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గుడిసెల్లోకి నీళ్లు చేరి బియ్యం, కందిపప్పు తదితర నిత్యావసర సరుకులు తడిసిపోవడంతో కాలనీ వాసులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో వేసిన మట్టి రోడ్లు వర్షాలకు అధ్వానంగా మారాయన్నారు. కాలనీలో వెంటనే సీసీ రోడ్లు, విద్యుత్ స్తంబాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళ్లల్లో విష సర్పాలు సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. వర్షపు నీటిలో దోమలు వ్యాప్తి చెండంతో అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు సిపిఎం కొట్టాలను సందర్శించి వారికి వెంటనే పట్టాలు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల గుడిసె వాసులందరూ కలిసి తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ బేబీకి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కే భాస్కర్ రెడ్డి, టి గోపాలకృష్ణ, డివైఎఫ్‌ఐ అధ్యక్షుడు బాబు, ఎస్ బాలయ్య, ఆర్.జయరాణి, ఎస్ సాజిదాబి, రాము, శివ, రామిరెడ్డి, కాలనీ వాసులు లక్ష్మీదేవి, సుబ్బమ్మ, రామలక్ష్మమ్మ, మధు, తిరుపతయ్య పాల్గొన్నారు.