వినాయక కూడలి వద్ద బళ్లారి రోడ్డు ట్రాఫిక్ పరిస్థితి
రాయదుర్గం : రాయదుర్గంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రం అవుతోంది. ప్రధాన రహదారుల్లో రాకపోకలు సాగించేలా నానావస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారానికి రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలి నుంచి వాల్మీకి నగర్ వరకు బళ్లారి రహదారిని విస్తరించాలని వాహనదారులు, ప్రజలు, ప్రయాణికులు చాలా రోజుల నుంచి కోరుతున్నా దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదు. వాహనాలు ఎక్కువ కావడంతో రహదారి ఇరుగ్గా మారింది. దీనికితోడు రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు, హోల్డింగ్‌లు, ఫ్లెక్సీ పోస్టర్లు, వాణిజ్య దుకాణాల శిబిరాలు ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. బళ్లారి వైపు రాకపోకలు సాగించే బస్సులను రోడ్డుపైనే నిలుపుతున్నారు. ఆర్టీసీ, ప్రయివేటు బస్సులు వినాయక కూడలిలోనే రివర్స్ చేసుకుంటున్నాయి. ఆటో స్టాండ్ వినాయక కూడలికి ఉత్తరంగా బళ్లారి రోడ్డుపై ఉంది. బళ్లారి వైపు నుంచి వచ్చిన బస్సులు బళ్లారి రోడ్డు వినాయక కూడలి వద్ద ఆపుతున్నారు. ఇతర రవాణా వాహనాలు, మోటార్ సైకిళ్లు ఈ రోడ్డుపైనే ఎక్కడబడితే అక్కడ ఆపుతున్నారు. వీటిన్నింటితో ఈ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అనంతపురం జాతీయ రహదారి నుంచి బళ్లారి వైపు వెళ్లేందుకు ఇంతవరకు బైపాస్ రహదారి లేదు. దీనివల్ల భారీ రవాణా వాహనాలు పట్టణం మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. బళ్లారి, బెంగళూరు వైపు వెళ్లివచ్చే వాహనాలు వినాయక కూడలిలోనే రివర్స్ చేసుకోవడం వల్లనూ తరచూ అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఈ వాహనాలు రాణి సత్రంలోకి వెళ్లి వస్తే కూడలిలో రివర్స్ చేసుకునే సమస్య తగ్గుతుంది. ఈ విషయం రవాణా, ట్రాఫిక్ పోలీస్ అధికారుల దష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయివేటు, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు వినాయక కూడలిలోనే బస్సులను రివర్స్ చేసుకుంటున్నారు. గతంలో ఒక ప్రయివేటు బస్సు ఇలా రివర్స్ తీసుకోబోయి వేగంగా వచ్చి కూడలిలో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం దిమ్మెను నేల కూల్చింది. వినాయక కూడలి నుంచి బళ్లారి రోడ్డుకు ఇరువైపులా భారీ ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడాన్ని మున్సిపల్ అధికారులు నిషేధిస్తే ట్రాఫిక్‌కు అంతరాయం తగ్గుతుంది. బస్సులు వినాయక కూడలిలో రివర్స్ చేసుకునేందుకు ట్రాఫిక్ పోలీస్ రవాణా అధికారులు నిషేధం విధిస్తే కూడా సమస్య తగ్గుతుంది. గతంలో అనంతపురం, బెంగళూరు రహదారుల వైపు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. బళ్లారి రోడ్డును కూడా విస్తరిస్తూ మధ్యలో డివైడర్ ఏర్పాటు చేస్తే శాశ్వత ట్రాఫిక్ సమస్య తప్పుతుంది. అంతవరకు రోడ్డుకు ఇరువైపులా కనీసం 10 అడుగుల మేరకు గల ఆక్రమణలను తొలగిస్తే తాత్కాలికంగా ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయాన్ని తగ్గించవచ్చు. శాంతినగర్ వారపు సంత మైదానం ప్రతి గురువారం జరిగే ప్రాంతంలో కూరగాయలు, ఆకుకూరలు, ఇతర తోపుడు బండ్లు, ఇతర చిరు వ్యాపారులు రోడ్డు పైన వ్యాపారాలు చేయకుండా రోడ్డుకు ఇరువైపులా కనీసం ఐదు నుంచి పది అడుగుల దూరం దుకాణాలు ఏర్పాటు చేయకుండా చూస్తే అక్కడ ట్రాఫిక్ పరిస్థితిని చక్కదిద్దవచ్చు. స్థానిక శాసనసభ్యులు, రాయదుర్గం పురపాలక మండలి, మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ అధికారులు, పోలీసు, రవాణా శాఖ అధికారులు ఈ విషయమై దష్టి సారించి ట్రాఫిక్ సమస్య చక్కదిదెందుకు అవసరమైన చర్యలు సంయుక్తంగా చేపట్టాల్సి ఉంది. బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగితే భారీ రవాణా వాహనాల రాకపోకలను పట్టణంలోకి రాకుండా కొంతవరకు ట్రాఫిక్ సమస్యను నివారించవచ్చు.