బీ’కరి’ దాడులు
ప్రజాశక్తి-బంగారుపాళ్యం, వి,కోట: ఆంధ్రా-కర్నాటక సరిహద్దుకు చేరిన ఏనుగుల గుంపు గ్రామాల్లో బీకర దాడులు చేస్తున్నాయి. పంటపొలాలు, అరటి తోటలపై పడి నాశనం చేస్తున్నాయి. గుంపులుగా విడిపోయి స్వైర విహారం చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రైతే రైతులు, గ్రామస్తులు భయం గుప్పిట్లో బెంబేలెత్తిపోతున్నారు. ఏనుగుల గుంపును అడవుల్లోకి మళ్లించేందుకు అటవీ అధికారులు, రైతులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని స్థానికంగా విస్తుపోతున్నారు. బుధవారం రాత్రి బంగారుపాళ్యం, వికోట మండలాల్లో వేర్వేరు ఏనుగుల గుంపులు దాడులు చేశాయి.బంగారుపాళ్యం మండంలో ఇలా..మండలంలోని కీరమంద ప్రభుత్వ పాఠశాల కిటికీలు విరిచి, పాఠశాలలోని మద్యాహ్న భోజన బియ్యపు బస్తాలు, రాగి జావా పిండిని ధ్వంసం చేశాయి. రాత్రైతే గ్రామాల సరిహద్దులకు చేరి అన్నదాత పంటలను నాశనం చేస్తున్నారు. గురువారం అధికారులు పాఠశాలలో ఏనుగుల దాడులను పరిశీలించారు. పాఠశాలలో ఏనుగుల దాడిలో వాటిళ్లిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని డీఈవో విజేంద్రరావు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.వికోట మండలంలో ఇలా..మండలంలోని అటవీ సరిహద్దు ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం రాత్రి కొమ్మర మడుగు, వెంకటేపల్లి, దానమయ్యగారిపల్లిలో ఏనుగుల గుంపు రైతు రాజన్నకు చెందిన రెండు ఎకరాల అరటి తోటను ధ్వంసం చేశాయి. కొమ్మరమడుగుకు చెందిన సుబ్బన్న బీన్స్ తోట, శివప్ప మొక్కజొన్న పంటలను తిని తొక్కి నాశనం చేశాయి. సుమారు రూ.4లక్షల నష్టం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కాగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.