ప్రజాశక్తి-రాజమహేంద్రవరంజిల్లాలో వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 4వ విడతలో అర్హులైన వధువు కుటుంబాలకు సొమ్ములు జమ చేసినట్టు కలెక్టర్ డా. కె.మాధవీ లత తెలిపారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలు, వికలాంగులు, భవన ఇతర నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకం కింద జిల్లాకు చెందిన 315 మంది లబ్ధిదారుల జంటలకు రూ.2,35,85,000 వేల ఆర్థిక సాయాన్ని అందజేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో 4వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేశారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, ఎంపీ మార్గాని భరత్ రామ్ లబ్దిదారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి వివాహ సమయంలో ఆసరాగా నిలిచేందుకు ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. 2023లో నాలుగు విడతల్లో జిల్లాకు చెందిన 1,622 మంది లబ్ధిదారులకు సుమారు రూ.12 కోట్ల 18 లక్షలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. ఫిబ్రవరి నెలలో తొలి విడతగా 108 మంది జంటలకుకు రూ.91.05 లక్షలు, మే నెలలో రెండో విడతలో 522 మందికి రూ.3.82 కోట్లు, ఆగస్ట్ నెలలో 3వ విడతలో 677 మందికి రూ.5 కోట్ల 8 లక్షల 35 వేలు జమ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో నాలుగో విడత కింద 315 మందికి రూ.235.75 లక్షలు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించే తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ ఈ ఆర్థిక సాయం జగనన్న ప్రభుత్వం అందజేస్తుందన్నారు. జూలై-సెప్టెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని వధువుల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ జమ చేసారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఆర్డిఎ పీడీ పి.వీణా దేవి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం.సందీప్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎస్.జ్యోతి, రుడా మాజీ ఛైర్పర్సన్ ఎం.షర్మిలా రెడ్డి పాల్గొన్నారు. చెక్కు అందిస్తున్న కలెక్టర్ మాధవీలత, ఎంపీ మార్గాని భరత్