యాత్రప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో వీక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం ఈనెల 27 నుండి 6 ప్రచార వాహనాలతో 60 రోజులు పాటు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ తెలిపారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో వీక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం నిర్వహణపై జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, డిఆర్‌ఓ ఎన్.రాజశేఖర్, జిల్లా అధికారులతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల ఎంపిడిఓలు, ఇతర సంబంధిత మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించడానికి వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని రూపొందించిందని, ఈకార్యక్రమం నవంబర్ 27 నుండి ప్రారంభం కానున్నదన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు జిల్లాస్థాయి నోడల్ అధికారిగా జెడ్పి సీఈఓ వ్యవహరిస్తారని, జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 6 నియోజకవర్గాలకు 6 వీక్షిత్ భారత్ సంకల్ప్‌యాత్ర వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక్కో వాహనం ప్రతిరోజు రెండు పంచాయతీల్లో డిజిటల్ స్క్రీన్‌లో వీడియోల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమషెడ్యూల్‌ను ఎంపిడిఓలకు పంపడం జరిగిందన్నారు. వీక్షిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో అనుసంధానం చేసుకుని నిర్వహించాలన్నారు. ఎంపిడిఓలు మండలాలలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, దీన దయాళ్ అంత్యోదయ యోజన, పిఎం ఆవాస్ యోజన, పిఎం ఉజ్వల్ యోజన, పిఎం విశ్వకర్మ, పిఎం కిసాన్ సమ్మాన్, కిసాన్ క్రెడిట్ కార్డ్, పి ఎం పోషణ్ అభియాన్, జల్ జీవన మిషన్, స్వామిత్వ, జన ధన యోజన, జీవన జ్యోతి భీమా యోజన, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పిఎం ప్రణామ్, నానో ఫెర్టి లైజర్ వంటి 17 సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ పథకాల ద్వారా ఇంకనూ లబ్ధి పొందేందుకు అర్హులుంటే వారిని గుర్తించి నమోదు చేసేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో మొదట స్వాగతం తరువాత ప్రధానమంత్రి ప్రసంగం, సంకల్ప్ ప్రతిజ్ఞ, లబ్దిదారుల స్పందన, ప్రకతి వ్యవసాయం పద్ధతులను ఆచరిస్తున్న రైతులతో ముఖాముఖి, సాంస్కతిక కార్యక్రమాల నిర్వహణ, గ్రామస్థాయిలో ప్రతిభ కనపరచిన క్రీడాకారులను, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధితో అభివద్ధి చెందిన వారిని సన్మానించడం, విద్యార్థులచే క్విజ్ పోటీల నిర్వహణ, హెల్త్ క్యాంప్‌ల నిర్వహణ, టిబి స్క్రీనింగ్ తదితర కార్యక్రమాలను నిర్వహించేందుకు గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రెటరీలు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్‌లో భాగంగా ఫోటోలు, వీడియోలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. జెడ్‌పి సీఈవో, విబిఎస్‌వై నోడల్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి, డిఆర్‌డిఏ, డ్వామా, హౌసింగ్ పిడిలు తులసి, గంగా భవానీ, పద్మనాభం, సోషల్ వెల్ఫేర్ డిడి రాజ్యలక్ష్మీ, డిపిఓ లక్ష్మీ, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ చంద్రశేఖర్ రెడ్డి, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డిఎస్‌ఓ శంకరన్, డిఎల్‌డిఓ రవి కుమార్, ఎల్‌డిఎం హరీష్, జిఎం డిఐసి చంద్రశేఖర్, నెహ్రూ యువకేంద్ర కొఆర్డినేటర్ ప్రదీప్ కుమార్, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు చిన్నారెడ్డి, మూర్తి పాల్గొన్నారు.