పరిశ్రమ రాకతో పుంగనూరు ముఖ చిత్రం మారనుంది

Dec 1,2023 23:50
పరిశ్రమ రాకతో పుంగనూరు ముఖ చిత్రం మారనుంది

ప్రజాశక్తి-పుంగనూరు: పెప్పర్‌ మోషన్‌ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ పరిశ్రమ రాకతో పుంగనూరు ముఖ చిత్రం మారనుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద పరిశ్రమ సీఈవో బృందంతో కలసి కలెక్టర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి పరిశ్రమ సీఈవో ఆండ్రియాస్‌ హేగర్‌, సీటీవో డాక్టర్‌ మథియాస్‌ కెర్లర్‌, సీఎస్‌వో సత్య, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఉవే స్టెల్టర్‌, నార్త్‌ ఎలక్ట్రానిక్‌ ఇండియా ఎండి హర్షఆద్య, పరిశ్రమ సిఐవో రాజశేఖర్‌రెడ్డి, నల్లపరెడ్డి, సీఎస్‌వో సత్య, సీసీవో రవిశంకర్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో అత్యాధునిక టెక్నాలజీతో చిత్తూరు జిల్లా పుంగనూరులో జర్మన్‌ పెప్పర్‌ మోషన్‌ కంపెనీ ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందన్నారు. రూ.4640కోట్ల పెట్టుబడితో 800ఎకరాల్లోమ ప్లాంటు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినట్లు వెల్లడించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేశారన్నారు. పరిశ్రమ ఏర్పాటు పూర్తయితే నిరుద్యోగులు బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్థానికంగానే ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సుమారు 8100మంది ఈ పరిశ్రమ ద్వారా ఉద్యోగం పొందొచ్చన్నారు. పరిశ్రమ ఏర్పాటు ద్వారా కాలుష్యం తక్కువ శాతం ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. 2024 ఫిబ్రవరి నెలలో పరిశ్రమ నిర్మాణం ప్రారంభించేలా ప్రణాళికా రూపొందించడం జరగిందన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు స్థానిక ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు. పెప్పర్‌ మోషన్‌ సంస్థ సిఈఓ ఆండ్రియాస్‌ హేగర్‌ మాట్లాడుతూ భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశంలో ఉన్న జనాభా కారణంగా రవాణా వ్యవస్థలో అధికంగా బస్సులు, ట్రక్కులను వినియోగించడం జరుగుతోందని, తద్వారా అధిక శాతం కార్బన్‌ వాయువులు వెలువడతాయని, వీటి ద్వారా వాతావరణం కాలుష్యం అవుతుందని, కాలుష్య నివారణ ప్రధాన అంశంగా తమ స్వంత టెక్నాలజీతో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ చేయడం జరుగుతున్నదన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతలను పొందేందుకు సీఎం, జిల్లా కలెక్టర్‌ అందించిన సహకారం మరువలేనిదన్నారు. 2024 మార్చిలో పనులు ప్రారంభించి 2027కల్లా మూడు దశల్లో నిర్మాణం పూర్తి చేసి 100 ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కుల తయారీని ప్రారంభించేలా చర్యలు చేపడతామన్నారు. పూర్తి ఇంటిగ్రేటెడ్‌ విధానంలో, పర్యావరణానికి అనుకూలమైన ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్‌ల తయారీకి అవసరమైన అన్ని విడి భాగాలను స్థానికంగా తయారు చేయడం జరుగుతుందని, ఈ వాహనాలను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయడం జరుగుతుందన్నారు. పికెయం ఉడా ఛైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటు సంతోషించతగ్గ విషయం అన్నారు. కార్యక్రమంలో పలమనేరు ఆర్‌డిఓ మనోజ్‌కుమార్‌రెడ్డి, తహసిల్దార్‌ సీతారాం, ఎంపిడిఓ నాగరాజు, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌ భాష, స్టేట్‌ ఫోక్‌ అండ్‌ కల్చరల్‌ చైర్మన్‌ నాగభూషణం, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజురెడ్డి, జడ్పిటిసి జ్ఞానప్రసన్నచంద్రారెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.గోపిశెట్టి పల్లి గ్రామానికి అండగా ఉంటాం- విశ్రాంత డిఎస్పి సుకుమార్‌గోపిశెట్టిపల్లి గ్రామ రైతులకు అండగా నిలబడతామని విశ్రాంత డీఎస్పీ సుకుమార్‌, విఆర్పిఎస్‌ నాయకుడు అద్దాలు నాగరాజు భరోసా ఇచ్చారు. వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామాన్ని సందర్శించి అక్కడ రైతులకి న్యాయం జరిగేలాగా అండగా ఉంటామని చెప్పారు.పోలీసుల వలయంలో ఇరు గ్రామాలుజపాన్‌కి చెందిన పెప్పర్‌మోషన్‌ పరిశ్రమ ప్రతినిధులు పుంగనూరుకు వచ్చింది. అయితే వారు రాక ముందే పుంగనూరు మండలంలోని గోపిశెట్టిపల్లి, అమ్మిగానిపల్లి గ్రామాల్లో ముందస్తుగానే పోలీస్‌ పటాలం దిగిపోయింది. ఇరు గ్రామాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. గ్రామస్తులను ఎక్కడికక్కడ దిగ్భందించారు. పరిశ్రమ బృందాన్ని అడ్డుకొనే చర్యలు చేయకూడదని పోలీసుల హెచ్చరికతో రైతులు ఎక్కడికక్కడ చేసేదేమీ లేక గ్రామాల్లోనే ఉండిపోయారు. పోలీసులు మొహరించడంతో ఉదయం నుంచి పొలాలకు కూడా వెల్లలేని పరిస్థితిలో ఉండాల్సి వచ్చిందని గ్రామస్తులు ఆవేధన వ్యక్తం చేశారు. తమకు ఆదరవుగా ఉన్న భూములు వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని, అలాంటి పరిస్థితిలో ఆత్మహత్యలైనా చేసుకుంటామని భూములు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని రైతులు తేల్చి చెబుతున్నారు.

➡️