వీక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ప్రచార వాహనాలను ప్రారంభించిన కలెక్టర్‌

Nov 25,2023 23:18
వీక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ప్రచార వాహనాలను ప్రారంభించిన కలెక్టర్‌

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని ప్రతి పంచాయతీలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తతప్రచారం కొరకు వీక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ప్రచార వాహనాలను ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ తెలిపారు. శనివారం చిత్తూరు గాంధీ విగ్రహం కూడలి నుండి వీక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ప్రచార వాహనాలను కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించగా పివికెఎన్‌ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, జిల్లాస్థాయి అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో విస్తత ప్రచారం కల్పించడానికి సంకల్పించి వీక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్రను ప్రారంభించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 రోజుల పాటు నిర్దేశించిన ఈయాత్ర ఈ నెల 27 నుంచి జిల్లాలో 6 నియోజకవర్గ పరిధిలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున తిరుగుతాయని, వీక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర వాహనాలు రోజుకు రెండు పంచాయతీల చొప్పున పకడ్భందీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం నోడల్‌ అధికారిని నియమించిందని, త్వరలో జిల్లాలో నోడల్‌ అధికారి పర్యటిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో జెడ్పి సిఈఓ, మండల స్థాయిలో ఎంపిడిఓలు నోడల్‌ అధికారులుగా వ్యవహరిస్తారని, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలు సమన్వయం చేసుకుని ప్రజలను భాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

➡️