ప్రభుత్వ బడులను రక్షించుకుందాం..

Nov 26,2023 23:26
ప్రభుత్వ బడులను రక్షించుకుందాం..

యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు పిలుపుప్రజాశక్తి- పుత్తూరుటౌన్‌ విద్యారంగ సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తోందని, ప్రాథమిక పాఠశాలలను పరిరక్షించునే బాధ్యత సమాజంతోపాటు ఉపాధ్యాయులు తీసుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా 49వ కౌన్సిల్‌ సమావేశాలు పుత్తూరు కేంద్రంలో జివిఆర్‌ కన్వెన్షన్‌లో జరిగాయి. ఈ సమావేశానికి యూటిఎఫ్‌ తిరుపతి జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌ అధ్యక్షత వహించారు. ఈ కౌన్సిల్‌ సమావేశాన్ని ప్రారంభం అనంతరం యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యారంగ సంస్కరణలు ప్రభుత్వ విద్యకు అభివద్ధి చేస్తోందని, నాణ్యమైన విద్య, సబ్జెక్టు టీచర్లు మూడో తరగతి నుండే బోధిస్తామని, ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నామని అంతర్జాతీయ విద్యార్ధిగా తయారు చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పిందని అన్నారు. అయితే ఆచరణలో ఇవేవీ నెరవేరకపోగా, ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు వలస పోతున్నారని తెలిపారు. ప్రభుత్వం బడులు సుందరంగా ఉన్నా, పిల్లలు ప్రైవేటు బడికి ఎందుకు వెళుతున్నారో సమీక్ష చేసుకోకుండా, ఆ తప్పును ఉపాధ్యాయులు మీద నెట్టి, వాళ్ళను మానసిక వేధింపులకు గురిచేయడాన్ని మానుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరంతరం పర్యవేక్షణ పేరుతో ఆర్థిక దొంగలు లాగా ఉపాధ్యాయులపై ఛార్జిషీట్‌ పెట్టి ఇంక్రిమెంట్లు కట్‌ చేస్తున్నటువంటి దారుణంపై తూర్పారబట్టారు. ఇలా ఛార్జి మెమోలు ఉపసంహరించుకోకపోతే ఉద్యమాలు చేస్తామని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో 14వేలు ఏకోపాధ్యాయ పాఠశాలలు, యూపీ పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో ఎన్రోల్మెంట్‌ తగ్గడం వాస్తవం కాదా అన్నారు. అలాగే ఉపాధ్యాయులను బోధన పనికే వినియోగించకుండా, బోధనేతర పనులకే ఉపయోగించుకోవడం వాస్తవం కాదా…అని ప్రశించారు. ఎలాంటి భౌతిక పరిస్థితులను పట్టించుకోకుండా ఒక్క ఉపాధ్యాయులను మాత్రమే బాధ్యులు చేసి శిక్షించడం సరికాదని చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు స్నేహపూరిత వాతావరణంలో విద్యార్థులకు పాఠాలు బోధించే విధంగా వాతావరణం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు సమాజంతో కలిసి రక్షించుకునేటువంటి బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని, అవసరమైతే ఒక గంట అదనంగా పాఠశాలలో పిల్లల స్థాయిని పెంచడానికి వినియోగించాలని కోరారు. పాతపెన్షన్‌ ఇస్తానన్న వారికి మాత్రమే 2024 ఎన్నికల్లో ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజ మాట్లాడుతూ మాతభాషలో ప్రాథమిక విద్య ఉండాలని మానసిక శాస్త్రవేత్తలు పదేపదే చెప్తున్న, దాన్ని పెడచెవి పెట్టి ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చటమే కాకుండా, సిబిఎస్‌ఈ, బైజుస్‌, టోఫెల్‌ సిలబస్‌, ఐబీ అని రోజుకో కొత్త సంస్కరణ తీసుకొచ్చి, విద్యారంగాన్ని గందరగోళాన్ని గురిచేస్తున్నారని విమర్శించారు. కనుక ప్రాథమికస్థాయిలో మాతభాషలోని విద్య ఉండాలని చెప్పిన కొఠారి కమిషన్‌ అభిప్రాయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కార్యదర్శి టి.రఘుపతి రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాబోయే ముందు సిపిఎస్‌ని రద్దుచేసి పాత పెన్షన్‌ ఇస్తానన్న ప్రభుత్వం మాట తప్పి మరొక గ్యారెంటీ లేని జిపిఎస్‌ విధానాన్ని ముందుకు తెచ్చిందని, ఈ దేశంలో అత్యంత గొప్ప పథకం అని ప్రచారం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. ఇప్పటికైనా జిపిఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే సిపిఎస్‌ రద్దు ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయుల మీదపెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. యూటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్‌.నాయుడు మాట్లాడుతూ యూటీఎఫ్‌ ఉద్యమాలకు దిక్చూచిగా వ్యవహరిస్తుందని, నిరంతరం పోరాటాల ద్వారా ఎన్నో హక్కులు సాధించుకున్నామని, ఈహక్కులన్నీ కాలరాయబడుతున్నాయని, భవిష్యత్తులో హక్కులను కాపాడుకునేందుకు యూటీఎఫ్‌ చేసే పోరాటాలలో ఉపాధ్యాయులు కదిలి రావాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా డీఈవో శేఖర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో క్రియాశీలకంగా వ్యవహరించే యుటిఎఫ్‌ అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం మీ వంతు కషి చేయాలని, అలాగే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు విద్యార్థులకు సక్రమంగా అందుబాటులోకి వచ్చేటట్లు మీరు కషి చేయాలని ఉపాధ్యాయులు కోరారు. సిఐటియు రాష్ట్ర సహాధ్యక్షులు కె.మురళి మాట్లాడుతూ ఈరోజు దేశంలో రాజకీయ పరిస్థితులు వేగవంతంగా మారిపోతున్నాయని, మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలను దూరంగా ఉంచాలని చెప్పి ఉపాధ్యాయులను కోరారు. హక్కుల కోసం నిలబడే వారిని, ప్రశ్నించే వారిని దేశ ద్రోహులుగా చిత్రించే వాతావరణం కనిపిస్తుందని, ఈ చర్యలను ప్రభుత్వాలు మానుకోవాలని తెలియజేశారు. నియంతత్వ పోకడలు ఎల్లకాలం సాగవని ప్రజాతంత్ర హక్కులని కాపాడుకునే దానికోసం ఉపాధ్యాయులు నడుం బిగించాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవరాల నిర్మల, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల రెడ్డి, నాయకులు శేఖర్‌, కందల శ్రీదేవి, సూర్యప్రకాష్‌, రమేష్‌ నాయుడు, జిల్లా కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️