పంచాయతీ రాజ్‌ వ్యవస్థ నిర్వీర్యం

మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు

ప్రజాశక్తి-నక్కపల్లి:పంచాయతీ రాజ్‌ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి, టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. నక్కపల్లిలో శనివారం జరిగిన మాజీ ఎమ్మెల్యే అనిత గృహ ప్రవేశానికి అయ్యన్న హాజరై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూర్వం గ్రామాలు అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పడిందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం బాగుంటుందన్న సంకల్పంతో ఆనాడు పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వం అందించే నిధులు, పన్నుల ద్వారా సర్పంచ్‌లు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేవారన్నారు. నేటి రాజకీయ నేతలకు గ్రామీణ పంచాయతీ రాజ్‌ వ్యవస్థపై అవగాహన లేకపోవడం దారుణమన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులను పక్కనపెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అవగాహన లేని వాలంటీర్‌ వ్యవస్థను తీసుకు వచ్చారని విమర్శించారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారని, కనీసం రూ.53ల అవినీతి చూపించలేక పోయారన్నారు. కొత్తగా రింగ్‌ రోడ్డు కేసు పెట్టారని, అసలు రోడ్డే వేయలేదని కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు జగన్‌కు తొత్తులుగా వ్యవహరి స్తున్నారని విమర్శించారు. విశాఖకు రక్షణ కవచం ఋషికొండ అని అన్నారు. తుఫాన్లు అడ్డుకునేందుకు ఋషి కొండ రక్షణ కవచంలా కాపాడుతుందన్నారు. అటువంటి కొండను నాశనం చేసి రూ.430 కోట్లతో సీఎంకు బిల్డింగ్‌ నిర్మించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. ఎవరు సొమ్ముతో బిల్డింగ్‌ నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేశారన్నారు. 11 లక్షల కోట్లు అప్పు తెచ్చారని, జగన్‌ పోతే ఎవరు తీరుస్తారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా, ఆయన చేసిన అభివృద్ధిగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. జగనే ఎందుకు కావాలని కార్యక్రమం పై విమర్శించారు. రాజధాని నిర్మించారా? ప్రత్యేక హౌదా సాధించారా? విశాఖకు మెట్రో ట్రైన్‌ తీసుకువచ్చారా.. ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.సిపిఎస్‌ రద్దు చేస్తానని చెప్పి ఉపాధ్యాయులను మోసం చేశారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, మాడుగుల ఇన్చార్జి కుమార్‌, నక్కపల్లి పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్‌ పాల్గొన్నారు.

➡️