ప్రజాశక్తి- విలేకర్ల బృందం
మహాకవి గురజాడ అప్పారావు 108వ వర్థంతి కార్యక్రమాలు ఐద్వా, సిఐటియు, డివైఎఫ్‌ఐ తదితర సంఘాల ఆధ్వర్యాన గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరవాడ : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలు పి మాణిక్యం ఆధర్యంలో గురువారం పరవాడ జిల్లా పరిషత్తు బాలిక హైస్కూల్లో గురుజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాఠశాల హెచ్‌ఎం రాజేశ్వరి మాట్లాడుతూ గురజాడ అప్పారావు పుత్తడిబొమ్మ పూర్ణమ్మ రచనతో పాటు కథలు, పాటలు, పద్యాలు, కళారూపాల ద్వారా బాల్య వివాహాలు, బాలికలు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి కృషి చేశారని తెలిపారు. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించారని, ప్రజలకు అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారని, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో 200 మంది విద్యార్థినులు దేశభక్తి గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో ప్రసన్న, సుమతి, లావణ్య, వాణి, నీలిమ, ఝాన్సీ, లావణ్య, సరూప తదితరులు పాల్గొన్నారు.సంతబయలులో..పరవాడ సంత బయల వద్ద గురజాడ చిత్రపటానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ పూలమాలవేసి శ్రద్దాంజలి ఘటించారు. గురజాడ రచించిన దేశమును ప్రేమించమన్న మంచి అన్నది పెంచుమన్నా దేశభక్తి గీతాన్ని ఆటో కార్మికులకు పాడి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచరికపు హద్దులు బద్దలగొట్టి, రాజభక్తిని, దైవభక్తిని వీడి దేశభక్తి వైపు ప్రజలను నడిపించిన అక్షర యోధుడు గురజాడ అప్పారావు నేటి తరానికి నిత్య మార్గదర్శి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి రాంబాబు, పి పరదేశి నాయుడు, వి రవి, సిహెచ్ రమణమ్మ, ఆర్ సంతోష్, పి అప్పలరాజు, పాల్గొన్నారు.అచ్యుతాపురం : అచ్చుతాపురం హైస్కూల్లో గురజాడ అప్పారావు చిత్రపటానికి ఐద్వా నాయకులు పూలమాలవేసి శ్రద్దాంజలి ఘటించారు. ఆయన రచించిన పాటలను విద్యార్థులు ఆలపించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయురాలు రామలక్ష్మి, ఐద్వా మండల కార్యదర్శి ఆర్.లక్ష్మి, నాయకులు సత్యవతి, వనజ, మానస, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.కశింకోట : కశింకోట బాలికల హైస్కూల్‌లో ఐద్వా, సిఐటియు, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన గురజాడ అప్పారావు చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం స్వర్ణకుమారి, ఐద్వా జిల్లా నాయకురాలు డిడి.వరలక్ష్మి, సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు శివాజీ, ఉపాధ్యాయులు శకుంతల, కల్పన, అనిత, కాళిదాసు, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.యస్.రాయవరం:మహాకవి గురజాడ అప్పారావు గారు వర్ధంతి వేడుకలు జన్మస్థలం ఎస్ రాయవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని సెంటర్లో గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఎంపీపీ కోనలక్ష్మి చేతుల మీదుగా అప్పారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గొప్ప వ్యక్తి మన రాయవరం గ్రామంలో జన్మించడం గర్వకారణమన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బైపా శ్రీను, మాజీ సర్పంచ్ నానాజీ, పలువురు వైసిపి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విశాఖ కలెక్టరేట్ : మహాకవి గురజాడ వర్థంతి సందర్భంగా విశాలాంధ్ర పుస్తక మహోత్సవ ప్రాంగణం టర్నర్ సత్రంలో అరసం ఆధ్వర్యాన సాహితీ సభ నిర్వహించారు. ముందుగా గుజ్జు వెంకటరెడ్డి రచించిన సంస్కృతి-సంస్కారము పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కథా రచయిత ఎస్.హనుమంతరావు, డాక్టర్ క్షేత్రపాల్, ఆచార్య డివి.సూర్యారావు, వెలమల సిమ్మన్న, అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల అప్పలరాజు, పి.శ్యాంసుందర్, పిఎ.రాజు, కవులు, రచయితలు పాల్గొన్నారు.