ప్రజాశక్తి-పాడేరు: తమకు ఉద్యోగ భద్రత, కల్పించాలని, లేని పక్షంలో డిసెంబర్ 20 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని సమగ్ర శిక్ష ఉద్యోగులు శనివారం పాడేరులో జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ సర్వ శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.అనిల్ కుమార్ వి.జయరాజ్ మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న తమ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అలక్ష్యం వహించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పని చేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పిఆర్సి అమలు చేయకుండా నెలల తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. సీఎం ప్రకటించిన మినిమం ఆఫ్ టైం స్కేల్ పై జీవోలు ఇచ్చి అమలు చేయడం లేదని అన్నారు. త్వరలోనే ఎంటీఎస్ అమలు చేస్తామని, శాసనమండలిలో విద్యాశాఖ మంత్రి లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చి మూడేళ్లయినా అమలు చేయలేదన్నారు. కేజీబీవీ టీచర్లకు మే అరకొరగా జీతాలు పెంచి చేతులు దులుపుకున్నారని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు దశలవారీగా తమ ఆందోళన కొనసాగుతుందని తదనంతరం నిరవధిక సమ్మె చేపడుతామని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి ఎల్ వీరభద్రమ్మ, జిల్లా ట్రెజరర్ సింహాచలం పాల్గొన్నారు.