ప్రజాశక్తి-పాడేరు: ఏజెన్సీలో సుదీర్ఘకాలం నుంచి మారుమూల గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్న సిహెచ్‌డబ్ల్యులను ఆశా వర్కర్లుగా తక్షణమే మార్పు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్‌దేవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఐటీడీఏ ముందు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు (సిహెచ్ డబ్ల్యు లు) చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు శనివారం కొనసాగాయి. ఈ దీక్షా శిబిరాన్ని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్, జిల్లా అధ్యక్షులు ధర్మన్నపడాల్, ఉపాధ్యక్షులు ఎల్.సుందర్రావు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బాలదేవ్ మాట్లాడుతూ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, ఆశా వర్కర్లతో సమానంగా పని చేస్తున్నప్పటికీ ఇచ్చే జీతం సిహెచ్‌డబ్లులకు 4వేలు ఇవ్వడం సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఇటువంటి వ్యత్యాసం లేదని, అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 750 మంది కమ్యూనిటీ వర్కర్లకు ఈ వ్యత్యాసం ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అనేక మార్లు ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి కోరినా కనీసం స్పందించలేదన్నారు. సిహెచ్‌డబ్ల్యులకు ఇచ్చే నెల జీతం 4వేలు కుటుంబ పోషణకు సరిపోలేదని, ఇచ్చే జీతం కూడా ప్రతి నెలా చెల్లించడం లేదన్నారు. ఒకవైపున ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ఇచ్చే వేతనం పెంచ లేదని విమర్శించారు. యూనిఫాం, సెల్ ఫోన్లు, మెడికల్ కిట్లు ఇవ్వాలన్నారు. వీరి ఉద్యమానికి ఆదివాసి గిరిజన సంఘం అండగా నిలబడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం జిల్లా కార్యదర్శి వై.మంగమ్మ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సంఘం కిల్లో పార్వతమ్మ, టి మోదకొండమ్మ, జె.సావిత్రి, వి.కొండమ్మ, కే.చిన్ని, బి.లక్ష్మి, పి.కరుణావతి, పద్మ, శేషు పాల్గొన్నారు.