నోటిఫికేషన్‌ విడుదల చేయాలి

వినతిపత్రం అందజేస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం నేతలు అప్పలనర్స, బాలదేవ్‌

ప్రజాశక్తి -పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా లో మహిళ, శిశు సంక్షేమ శాఖలో మిషన్‌ వాత్సల్య కింద మంజూరైన పోస్టుల భర్తికి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, ఈ ఉద్యోగాలల్లో ఎస్టీలకు ఒక్క పోస్ట్‌ కూడా కేటాయించక పోవడం అన్యాయమని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నూతనంగా ఏర్పడిన ఆదివాసీ జిల్లా లో మహిళ, శిశు సంక్షేమ శాఖ మిషన్‌ వాత్సల్య కింద మంజూరైన పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆదివాసీ గిరిజన సంఘం నేతలు కలెక్టర్కు వివరించారు. స్థానిక ఆదివాసీ యువతకు ఉద్యోగాల కల్పనకు రీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు. అల్లూరి జిల్లా పాడేరు 11 మండలాల్లోని గురుకులం, ఏకలవ్య స్కూళ్లలో సుమారు 60 మంది మహిళా సెక్యూరిటీ గార్డులు గత సంవత్సరాల పాటు పని చేస్తున్నారని, వారిని తొలగించి వేరే వారిని నియమకం చేపడుతున్నారని కలెక్టర్కు వివరిం చారు. అరకొర జీతంతో గత 2 సంవత్సరాల నుంచి పని చేస్తున్న వారిని కాదని, కొత్త వారితో నియమాకం చేపట్టడం సమంజసం కాదన్నారు. రెండేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డులను కొనసాగిస్తూ రెన్యువల్‌ ఆర్ధరు ఇవ్వాలని కోరారు ఐ.సి.డి.ఎస్‌ నోటిఫికేషన్‌ రద్దు చేస్తామని, స్థానిక ఆదివాసీ యువత కు ఉద్యోగం కోసం రోస్టర్‌ పాయింట్లు ఆధారంగా ఉద్యోగం ఇస్తామని వేరే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ వెల్లడించారు. ఆదివాసీ మహిళ సెక్యూరిటీ గార్డులను తిరిగి నియామకం కోసం రాష్ట్ర అధికార్లతో సంప్రదిస్తామన్నారు. టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలకు కూడా అధికార్లకు సిఫార్స్‌ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్శ, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాల్‌ దేవ్‌, మహిళ సెక్యూరిటీ గార్డు లు సీతమ్మ, మమత, ప్రశాంతి, నిర్మల, మంగ, నాగమణి పాల్గొన్నారు.

➡️