హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు : సిఐటియు

ప్రజాశక్తి-చీమకుర్తి : కార్మిక హక్కులు కాపాడుకోవాలంటే ఐక్య పోరాటాలతోనే సాధ్యమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌ పేర్కొన్నారు. స్థానిక దాచూరిరామిరెడ్డి భవనంలో శ్రామిక మహిళా సమస్యలు-ప్రభుత్వ వైఖరి-పరిష్కార మార్గం అనే అంశంపై శుక్రవారం అవగాహన తరగతులు నిర్వభహించారు. ఈ తరగతులకు యు.ఆదిలక్ష్మి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి కీలకమైన బ్యాంకులు, ఎల్‌ఐసి, రైల్వే, పోర్టులు,టెలికాం,బొగ్గు, రక్షణ, ఉక్కులాంటి ప్రభుత్వరంగ సంస్థలను విదేశీ కార్పొరేట్లకు కారుచౌకగా అమ్ముతున్నారన్నారు. పోరాటాల ద్వారానే వాటిని కాపాడుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉన్న 44 కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్‌ కోడ్స్‌గా మార్పు చేసినట్లు తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డిఎంకె.రఫీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వివిధ రకాల భారాలు మోపుతుందన్నారు. సమస్యలపై కార్మికవర్గం పోరాటాలు చేయాల్సి ఉందన్నారు. ఈనెల 27,28 తేదీల్లో విజయవాడలో నిర్వహిస్తున్న మహాధర్నాను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బంకా సుబ్బారావు, మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు, నాయకులు పూసపాటి వెంకటరావు, టి.శ్రీను, శారద, నాగరత్నం, శివరంజని, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్నభోజనం పథకం కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

➡️