ఏఐ యాంకర్‌

Nov 22,2023 18:43
AI Anchor

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెంట్‌ ఆధారంగా పనిచేసే యాంకర్‌లు ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి వచ్చేశారు. నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ అనే ఒక టెక్నాలజీ ద్వారా ఇది పనిచేస్తుంది. ఈ యాంకర్‌లు ఇంగ్లీష్‌, తెలుగు వంటి భాషలలోని స్క్రిప్ట్‌ను ఆయా భాషలలో చెబుతాయి. ఈ యాంకర్లు కంప్యూటర్‌లో మాత్రమే కనిపిస్తారు. అందుకే వీరిని వర్చువల్‌ అసిస్టెన్స్‌ అని కూడా అంటారు. స్క్రిప్ట్‌లోని సమాచారాన్ని యథాతథంగా తమ గొంతు నుంచి పలికిస్తాయి. ఈ మధ్యకాలంలో ఈ ఏఐ యాంకర్లకు ఇంత పాపులారిటీ పెరగడానికి కారణం ఏమిటంటే…. 2018లో చైనాకు చెందిన జున్‌హా అనే కంపెనీ ఒక పురుష యాంకర్‌ని రూపొందించింది. ఆ తర్వాత స్త్రీ యాంకర్లను కూడా తీసుకొచ్చారు. అలాగే రష్యాకు చెందిన సోయా టీవీ చానల్‌లో వాతావరణ రిపోర్టును ఏఐ యాంకరే చెపుతారు. ఈ యాంకర్‌ పేరు స్నిహానా తొమనొవా. రష్యా, చైనాలు ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టడంతో మిగతా దేశాలు కూడా అదే బాట పట్టాయి. 2023లో భారత్‌లో ఇండియా టుడే గ్రూప్‌ వారు సనా అనే ఏఐ యాంకర్‌ను తీసుకొచ్చింది. టెక్ట్స్‌ టు స్పీచ్‌ సాంకేతికత ద్వారా ఈ యాంకర్‌ పనిచేస్తుంది. ఈమధ్య కాలంలోనే ‘ఓ’ టీవి (ఒడియా టీవీ) లేసా అనే యాంకర్‌ని తీసుకొచ్చారు. ఈ యాంకర్‌ పూర్తిగా ఒడియా భాషలోనే మాట్లాడుతుంది. తాజాగా తెలుగులో బిగ్‌ టీవీ మాయా అనే యాంకర్‌ని తీసుకొచ్చారు. అయితే మామూలు మనుషులైతే… వారికి వచ్చిన రెండు మూడు భాషలలోనే యాంకరింగ్‌ చేయగలుగుతారు. ఈ ఏఐ యాంకర్స్‌ ఒక్క ఒరియా, తెలుగు భాషలోనే కాదు, ప్రపంచంలోని ఏ భాషలోనైనా మాట్లాడగలరు. వారికిచ్చే ఇన్‌పుట్స్‌లో ఏ భాష ఎంపిక చేసుకుంటే, ఆ భాషలో యాంకర్‌ మాట్లాడుతుంది. అయితే, ఆయా భాషలను బట్టి.. ఆయా రాష్ట్రాల సంస్కృతికి అనుగుణంగా వారి డ్రెస్సింగ్‌ కూడా వుంటుంది. అందువల్ల వారికి వేరే భాష రాదని అనుకోనక్కరలేదు. ఉపయోగాలు :- ఏఐ యాంకర్‌లో ముఖ్యంగా ఏ భాష అయినా… దానికి అనుగుణంగా మారే అవకాశం వుంది. అంటే… ఒకే యాంకర్‌ని ఎన్ని భాషలకైనా ఉపయోగించుకోవచ్చన్నమాట. – మనిషి యాంకర్‌ అయితే ఎనిమిది గంటలో పదిగంటలో పనిచేయగలుగుతారు. అదీకాకుంటే… 12గంటలు పనిచేయగలుగుతారు. అదే… ఏఐ యాంకర్‌ అయితే, నిర్విరామంగా… విశ్రాంతి అనేది లేకుండా నిరంతరాయంగా పనిచేస్తూనే వుంటుంది. – మానవ యాంకర్‌ అయితే, కొన్నిసార్లు తడబడే అవకాశం వుంటుంది. కొన్ని పదాలను సరిగా ఉచ్ఛరించలేకపోవచ్చు. కానీ, ఏఐ యాంకర్‌లో ఎలాంటి తడబాటుగాని, ఉచ్ఛారణ దోషంగానీ వుండదు. నష్టాలు :- మానవ యాంకర్స్‌ ఆయా సందర్భాలను బట్టి ఎమోషన్స్‌ను తమ ముఖంలో పలికిస్తుంటారు. కానీ, ఏఐ యాంకర్స్‌ ఎమోషన్స్‌ని పలికించలేకపోతున్నాయి. అయితే, వాతావరణ రిపోర్టు చెప్పే రష్యా యాంకర్‌ వంటివారు తమ ముఖంలో ఎమోషన్స్‌ పలికించగలవు. కాకపోతే… ఇందుకు కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం టెక్ట్స్‌ టూ స్పీచ్‌ని చదవగలిగే యాంకర్లు మాత్రమే మన దేశంలో వున్నారు. – మరీ ముఖ్యంగా ఏఐ వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే, ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా, వాటిని ఆపరేట్‌ చేయడానికి కూడా కొన్ని ఉద్యోగాలు అవసరం అవుతాయనే వాదనలు కూడా వున్నాయి. ఏదేమైనప్పటికీ కొత్తగా ఒక సాంకేతికత ఆవిష్కృతమైనప్పుడు… కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు వుంటాయి. వాటిని అధిగమించి, సాంకేతికతను సమాజ ప్రయోజనానికి ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. అప్పుడే ఆ ఆవిష్కరణ ప్రయోజనకారిగా వుంటుంది.

తాజా వార్తలు

➡️