మస్క్‌ పోస్ట్‌ దుమారం : యాడ్స్‌ను ఆపేస్తూ దిగ్గజ సంస్థల నిర్ణయం..!

Nov 18,2023 12:31 #adds, #cancle, #companies, #elon musk, #post, #x

Ads on X : ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ‘ఎక్స్‌’లో తమ యాడ్స్‌ను నిలిపివేస్తున్నట్లు యాపిల్‌, డిస్నీ వంటి దిగ్గజ సంస్థలు ప్రకటించాయి. ఎలాన్‌ మస్క్‌ చేసిన ఓ పోస్టు రేపిన దుమారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

యూదు వ్యతిరేక పోస్టులు-మస్క్‌ మద్దతు..!
ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం సమయంలో … ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ‘ఎక్స్‌ వేదికగా యూదు వ్యతిరేక పోస్టులు రావడం, వాటిల్లో కొన్నింటికి ఆ సంస్థ యజమాని ఎలాన్‌ మస్క్‌ మద్దతు పలకడం దుమారాన్ని రేపింది. మస్క్‌ తీరుపై అమెరికా తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యానికి చెందిన దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎక్స్‌లో తమ యాడ్స్‌ను నిలిపివేస్తున్నట్లు యాపిల్‌, డిస్నీ వంటి సంస్థలు ప్రకటించాయి.

మస్క్‌ తీరుపై దిగ్గజ సంస్థల ఆగ్రహం…
ఎక్స్‌ వేదికగా యూదు వ్యతిరేక యూజర్లతో ఇటీవల మస్క్‌ విరివిగా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే యూదులు, శ్వేతజాతీయులను కించపరిచేలా ఓ యూజర్‌ పెట్టిన పోస్ట్‌కు మస్క్‌ స్పందిస్తూ.. ‘సరిగ్గా చెప్పారు’ అని అనడం తీవ్ర విమర్శలకు తెరలేపింది. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ తీవ్రంగా మండిపడింది. ”మస్క్‌ స్పందన యూదు కమ్యూనిటీని ప్రమాదంలో పడేస్తోంది” అని ధ్వజమెత్తింది. అటు మస్క్‌ తీరుపై మండిపడిన కొన్ని దిగ్గజ సంస్థలు … ‘ఎక్స్‌’లో తమ యాడ్స్‌ను నిలిపివేయాలని నిర్ణయించాయి.

టెస్లాలోనూ వ్యతిరేకత…
యాపిల్‌, ఐబీఎం, ఒరాకిల్‌, కామ్‌కాస్ట్‌, బ్రావో టెలివిజన్‌ నెట్‌వర్క్‌, యూరోపియన్‌ కమిషన్స్‌, లయన్స్‌ గేట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్పొరేషన్‌, వాల్ట్‌ డిస్నీ, పారామౌంట్‌ గ్లోబల్‌, వార్నర్‌ బ్రోస్‌ డిస్కవరీ వంటి సంస్థలు.. ఎక్స్‌ వేదికగా తమ యాడ్స్‌ ప్రసారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. మరోవైపు, మస్క్‌కు చెందిన టెస్లాలోనూ ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. టెస్లా సిఇఒ పదవి నుంచి మస్క్‌ను సస్పెండ్‌ చేయాలని కొంతమంది సంస్థ వాటాదారులు డిమాండ్‌ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలోనూ యాపిల్‌ తన ప్రకటనలను నిలిపేసింది…
యాపిల్‌ గతంలోనూ కొంతకాలంపాటు ఎక్స్‌లో తమ ప్రకటనలను నిలిపివేసింది. గతేడాది ఈ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ను కొనుగోలు చేసిన మస్క్‌.. ఉద్యోగాల కోతతోపాటు పలు విధానపరమైన మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన యాపిల్‌.. ఎక్స్‌ (అప్పటి ట్విటర్‌)లో యాడ్స్‌ను నిలిపివేసింది. అయితే, గతేడాది డిసెంబరులో మస్క్‌ స్వయంగా యాపిల్‌ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌తో సమావేశమై ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. ఆ తర్వాత యాపిల్‌.. ఎక్స్‌లో తమ యాడ్స్‌ను పునరుద్ధరించింది.

➡️