చైనా రోదసీ స్టేషన్‌లో చారిత్రక ఘట్టం ! : రెండు అంతరిక్ష నౌకల సిబ్బంది కలయిక

Oct 28,2023 10:55 #China

 

బీజింగ్‌ : చైనా మొదటి మానవ సహిత రోదసీ ప్రయాణానికి 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా రోదసీ స్టేషన్‌ తియాంగాంగ్‌ ఒక చారిత్రక ఘట్టానికి కేంద్రమైంది. షెంఝూ-16, షెంఝూ-17 అంతరిక్ష నౌకలకు చెందిన ఆరుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో కలుసుకున్నారు. గురువారం ఉదయం 11.14 గంటలకు షెంఝూ-17 రోదసీ నౌకను విజయవంతంగా నింగిలోకి ప్రయోగించారు. ఆరున్నర గంటల తర్వాత సాయంత్రం 5.46గంటల సమయంలో తియాన్హె రోదసీ స్టేషన్‌ కోర్‌ మాడ్యూల్‌తో షెంఝూ-17 రోదసీ నౌక అనుసంథానమైంది. రాత్రి 7.34గంటల సమయంలో షెంఝూ-16 సిబ్బంది రోదసీ నౌక తలుపు తెరిచి షెంఝూ-17 వ్యోమగాములను లోపలకు ఆహ్వానించారు. అనంతరం ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఆరుగురు కలిసి ఒక ఫోటో దిగారు. వీరందరూ కలిసి కక్ష్యలో భ్రమిస్తూ దాదాపు నాలుగు రోజుల పాటు చైనా రోదసీ స్టేషన్‌లో కలిసి పనిచేస్తారని సిఎంఎస్‌ఎ (చైనా మాన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ) తెలిపింది. రెండు రోదసీ నౌకల సిబ్బంది మధ్య ఈ సహకారం చైనా రోదసీ అన్వేషణలో గుర్తించదగ్గ చర్య కాగలదని వారు వ్యాఖ్యానించారు. రోదసీలో సుదీర్ఘకాలం నివాసం వుండే సామర్ధ్యాన్ని, నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుందని వారు పేర్కొన్నారు.

➡️