అంబులెన్స్‌కి కాల్‌ చేసి ప్రాణాన్ని కాపాడిన స్మార్ట్‌ వాచ్‌..!

Nov 13,2023 10:01 #smart watch

అమెరికా : పోయే ప్రాణాన్ని యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌ నిలబెట్టింది..! ఓ ఇంట్లో వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు.. అకస్మాత్తుగా అచేతన స్థితిలో పడిపోయాడు. అప్పుడు అతని చేతికున్న స్మార్ట్‌ వాచ్‌ వెంటనే అంబులెన్స్‌కి కాల్‌ చేసి అతడి ప్రాణాన్ని కాపాడింది.. ఇష్టపడి కొనుక్కున్న వాచ్‌.. నా ప్రాణం నిలబెట్టిందని సదరు వ్యక్తి చెప్పాడు.

వివరాల్లోకెళితే … అమెరికాకు చెందిన జోష్‌ ఫర్మాన్‌ టైప్‌ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్నాడు. ఓ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న ఫర్మాన్‌ శరీరంలో బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ పూర్తిగా తగ్గి నిలబడ్డ చోటే అచేతనంగా కుప్పకూలిపోయాడు. నోట మాట రాలేదు. శరీరంలో ఎలాంటి చలనం లేదు. ఆ సమయంలో అతడిని రక్షించేందుకు ఆ ఇంట్లో ఎవ్వరూ లేదు. కానీ …. ఫర్మాన్‌ కిందపడిపోవడంతో వెంటనే అప్రమత్తమైన అతని చేతికున్న యాపిల్‌వాచ్‌ వెంటనే 911కి (ఎమర్జెన్సీ నెంబర్‌)కి కాల్‌ చేసింది. అవతలి నుంచి 911 ఆపరేటర్‌ ఏం జరిగిందని అడిగే ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకపోయింది. అయితే యాపిల్‌వాచ్‌లో ఉన్న జీపీఎస్‌ ట్రాకర్‌ సాయంతో అంబులెన్స్‌ సిబ్బంది స్వల్ప వ్యవధిలో ఫర్మాన్‌ ఇంటికి చేరుకున్నారు. అత్యవసర చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఫార్మాన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న తనని యాపిల్‌వాచ్‌ కాపాడిందని సంతోషం వ్యక్తం చేశారు.

అంతా రెప్పపాటులో…
ఈ సందర్భంగా తనకు ఎదురైన ఘటన గురించి ఫార్మాన్‌ మీడియాతో తెలిపారు. ” ఫోన్‌లో మా అమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఫోన్‌నెంబర్లని కూడా స్టోర్‌ చేశా. నేను అపస్మారక స్థితిలో అచేతనంగా పడిపోవడంతో నా స్మార్ట్‌ వాచ్‌ ముందుగా 911కి కాల్‌ చేసింది. నేను ప్రమాదంలో ఉన్నానని మా అమ్మకి సమాచారం వెళ్లడం, ఆమె కూడా అంబులెన్స్‌కి కాల్‌ చేసి ఆరోగ్యం గురించి చెప్పడం.. వైద్యులు నా ప్రాణాలను కాపాడడం అంతా రెప్పపాటులో జరిగిపోయింది ” అని వివరించారు.

తాజా వార్తలు

➡️