తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్
ప్రజాశక్తి – ఆత్మకూర్
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30వేల ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్, మండల కార్యదర్శి వీరన్న, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి సుధాకర్, పండ్ల తోటల సంఘం అధ్యక్షులు మహబూబ్ బాషాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సహాయం రూ. 20వేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు వాగ్ధానం చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. ఖరీఫ్‌లో వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలన్నీ పూర్తిగా దెబ్బతి రైతులు నష్టపోయారని తెలిపారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ, పంటల బీమాను వర్తింపజేయడంతో పాటు ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం అందజేయాలన్నారు. వ్యవసాయ మోటార్లకు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టే జీవో నెం. 22ను రద్దు చేసి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ 2లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని, కొత్తపల్లి మండలంలోని చెరువులకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించాలని, యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ రత్నరాధికు అందజేశారు. ధర్నాలో ఎపి రైతు సంఘం నాయకులు పాల శివుడు, అంబయ్య, రామసుబ్బయ్య, నాగన్న, దర్గయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరసింహ నాయక్‌తో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.