గిరిజన గర్భిణి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన.. వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి సిపిఎం

Sep 26,2024 21:55

గిరిజనులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి – కొత్తపల్లి

ఈ నెల 21న ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన గిరిజన గర్భిణి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. సిపిఎం పార్టీ సీనియర్‌ నాయకులు ఏ రాజశేఖర్‌ మండల కార్యదర్శి ఎన్‌ స్వాములు డిమాండ్‌ చేశారు. కొత్తపల్లి మండల కేంద్రంలోని చెంచుగూడెంలో సిపిఎం సీనియర్‌ నాయకులు ఏ రాజశేఖర్‌, మండల కార్యదర్శి ఎన్‌ స్వాములు, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు వీరన్నలు గురువారం పర్యటించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కొత్తపల్లి చెంచుగూడెంలోని ఈరమ్మ అనే గిరిజన గర్భిణి ప్రభుత్వ ఆస్పత్రికి ప్రసవం కోసం వెళ్తే అక్కడి వైద్య సిబ్బంది ఆమెకు డెలివరీ చేయకుండా ఆత్మకూరుకు పొమ్మన్నారని తెలిపారు. అప్పటికే పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోనందున ఆస్పత్రి మెట్ల వద్దనే ప్రసవించడం బాధాకరమన్నారు. ఆస్పత్రి సిబ్బంది గర్భిణికి కనీసం బెడ్‌ ఇవ్వకపోవడం దారుణమన్నారు. చేసేది లేక గర్భిణి బంధువులు తల్లీ, బిడ్డను ఇంటికి తీసుకొచ్చారని తెలిపారు. ఇంటికి వెళ్లిన వారిని వైద్య సిబ్బంది బాధితురాలి ఇంటికి వెళ్లి ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్యం చేయడం పట్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల పట్ల నిర్లక్ష్యం వహించడం తగదని, వైద్య సిబ్బందిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.డాక్టర్లు సమ్మెలో ఉన్నారు : దీపా నాగవేణి, వైద్యురాలుఆ రోజు డాక్టర్లు సమ్మెలో ఉన్నారు. అదే సమయంలో స్టాఫ్‌ నర్సు విధుల్లో ఉండీ వేరే గర్భిణికి ప్రసవం చేస్తున్నారు. ఇందులోనూ గిరిజన మహిళ హెచ్‌ఏజీ పాజిటివ్‌ కేసు, హైరిస్క్‌ కేసు కావడంతో ఆత్మకూరు ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అయిన వారు సిబ్బందితో ఘర్షణపడి అక్కడికి వెళ్లము ఇక్కడే చేయాలని భయటికి వెళ్లారు. అప్పుడే ఆమె భయటనే ప్రసవం అయ్యింది. వెంటనే సిబ్బంది ఆమెను లోపలికి తీసుకు వెళ్లి అవసరమైన వైద్యం అందించారు. తర్వాత ఇంటి వెల్లి ఏఎన్‌ఎం జ్యోతి, సూపర్వైజర్‌ దేవకరుణమ్మలు నచ్చజెప్పి వైద్యశాలకు తీసుకువచ్చి వ్యాక్సిన్‌ ఇచ్చి 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచుకున్నాము. ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్నాక ఇంటికి పంపించాము.

తాజా వార్తలు

➡️