ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని అరకు వారపు సంత బయలు నుంచి కొల్లాపూట్టు రోడ్డుకు ప్రధాన వంతెన గత్తర జిల్లెడ గెడ్డ వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పునాది దశలోనే వదిలేయడంతో ఆ ప్రాంత గిరిజనులు రవాణా సౌకర్యానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుకు ఆనుకొని కొర్రాయి, కొల్లాపూట్టు, పంచాయతీ గ్రామాలతో పాటు ఒడిస్సా రాష్ట్రానికి అనుకొని పలు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల గిరిజనులకు ఎటువంటి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా, వైద్య సేవలు పొందాలన్నా, పండించిన కూరగాయలను విక్రయించాలన్న వారపు సంతల అరకు సంత బయలుతో పాటు అరకులోయ ప్రాంతానికి వచ్చి పనులు చేసుకుంటూ వెళుతుంటారు. ఆ ప్రాంత గిరిజనుల రవాణా సౌకర్యానికి గత్తర జిల్లెడ వంతెన ప్రధానంగా ఉంది. ఈ వంతెన నిర్మాణానికి గత రెండేళ్ల క్రితం నిర్మాణ పనులను ప్రారంభించారు. రాడ్లు వేసి పునాది దశ వరకు నిర్మించి అసంపూర్తిగా వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుపైన వర్షపు నీరు నిల్వ ఉండి పోతుండటంతో పాటు బురదగా మారుతుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతు ండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలంలో ఆ ప్రాంతం గిరిజనులు అనారోగ్యానికి గురైన వెంటనే 108 అంబులెన్సులో వ్యాధిగ్రస్తులను తరలించడానికి వాహనం వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని గిరిజనులు వాపోతున్నారు. ఒడిస్సాకు కనెక్టివిటీగా ఈ రోడ్డు ఉండటంతో నిత్యం ఒడిస్సా నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. దీనికి తోడు కొల్లాపూట్టు జలకరంగిని పర్యాటక ప్రదేశం ఉండడంతో పర్యాటకులు కూడా నిత్యం రాకపోకలు చేస్తుంటారు. వంతెన లేకపోవడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాడ్లు వేసి అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన ఈ వంతెనను పూర్తిగా నిర్మించాలని పలుమార్లు ఆ ప్రాంత గిరిజనులు సంబంధిత ఉన్నత స్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ ప్రాంత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అసంపూర్తిగా ఉన్న కోర్రాయి పంచాయతీ గత్తర జల్లెడ వంతెనను పూర్తిగా నిర్మించి రవాణా కష్టాలు తీర్చాలని ఆ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.