ప్రజాశక్తి-పాడేరు: పాడేరులో డిసెంబర్ 14, 15, 16 తేదీలలో నిర్వహించే ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. జీవన్‌కృష్ణ, పి. చిన్నారావు పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అధ్యయనం – పోరాటం నినాదంతో ఆదివాసీ విద్యార్థులకు నైపుణ్యమైన విద్య అందించుటకు నిరంతరం పోరాడుతోందని చెప్పారు. మౌలిక వసతులు, మెస్, కాస్మోటిక్స్ ఛార్జీలు రూ.3వేలు పెంచాలని, జి. ఓ 3 అమలు, ఖాళీగా వున్న టీచర్ పోస్టులు భర్తీ, విద్యార్థులకు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వైద్య విద్య వంటి వాటిపై నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. బాలికల హాస్టల్స్‌లో రక్షణ ప్రహారీ గోడలు, మరుగుదొడ్లు నిర్మాణం కోసం పోరాటం చేసి విజయం సాధించిందన్నారు. గిరిజన విద్యా సంస్థల్లో అనారోగ్యంతో గిరిజన విద్యార్థులు మృతి చెందుతున్నారని తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ అసిస్టెంట్స్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచకపోవడంతో అనేకమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. విద్యార్ధుల సమస్యలపై 43 రోజులుగా ఐటిడిఏ కార్యాయలం ఎదురుగా నిరాహరదీక్షలు, అధికారులతో చర్చలు జరిపి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నూతన విద్యా విధానం గిరిజన విద్యాభివృద్ధికి, నాణ్యతకు ఆటంకంగా మారిన నేపథ్యంలో గిరిజన విద్యారంగంలో సమస్యలపై మహాసభల్లో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పి.సింహాద్రి, కార్తీక్, ఐసుబాబు పాల్గొన్నారు.