దీక్షలు చేపడుతున్న సిహెచ్డబ్ల్యులు
ప్రజాశక్తి -పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో వైద్యఆరోగ్య శాఖలో పని చేస్తున్న సిహెచ్ డబ్ల్యులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశావర్కర్లుగా మార్చాలని పాడేరు ఐటిడిఏ ఎదురుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరవ రోజు బుధవారం కొనసాగాయి.ప్రభుత్వం స్పందించి తమను ఆశ వర్కర్లుగా మార్చకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.గిరిజన ప్రాంత మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు శెట్టి నాగరాజు దీక్ష శిబిరానికి వచ్చి సంఘీభావం తెలియజేశారు. ఒకే పని విధానం కలిగివున్న సిహెచ్డబ్ల్యులను ఆశా వర్కర్లుగా మారుస్తామని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు కచ్చితంగా చేయాలని డిమాండ్ చేశారు. సిహెచ్డబ్ల్యు నెలకు 4000 రూపాయలతోటే జీవితం గడపడం అన్నది చాలా దారుణమైన విషయమన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు గిరిజన ప్రాంత మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ తరపున పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, గిరిజన సంఘం నాయకులు సుందర్రావు, నడివీధి యూత్ అసోసియేషన్ సభ్యులు మద్దతు ఇచ్చారు.