ఆదివాసీలతోనే ఉద్యోగాలు భర్తీ చేయాలి

మాట్లాడుతున్న ఆదివాసీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స

ప్రజాశక్తి పాడేరు : ఆదివాసి ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉద్యోగాలన్నీ ఆదివాసులతోనే భర్తీ చేయాలని బుధవారం పాడేరులో నిర్వహించిన ఆదివాసి నిరుద్యోగుల సదస్సులో వక్తలు డిమాండ్‌ చేశారు. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు యస్‌ దర్మన్నపడాల్‌ అధ్యక్షతన ఈ సదస్సు నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సదస్సులో ఆదివాసీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్విభజనలో ఆదివాసీ జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ ప్రాంతంలో ఉన్నత విద్యా వంతులైన నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని తెలిపారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌ పొందుతున్నా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయలేదన్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఆదివాసీ నిరుద్యోగుల ఆశలపై జగన్‌ ప్రభుత్వం నీళ్లుచల్లిందన్నారు. 2020 ఏప్రిల్‌ 22న జి.ఓ 3ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని నాటి నుంచి నేటి వరకు ఆదివాసులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. గిరిజన గురుకులం, ఏకలవ్యతో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఆదివాసులకు ఉద్యోగం ఇవ్వ లేదన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రధాని మోడీ ఎన్నికల హామీ ఇచ్చి 9 సంత్సరాలైందని దుయ్యబట్టారు.ప్రశ్నించిన నిరుద్యోగులకు బజ్జీలు, పకోడీలు అమ్ముకొండంటూ అమిత్‌ షా సలహా ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ప్రకారం తక్షణమే 5 కోట్ల మందికి ఉపాధి కల్పించకపోతే దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నెట్టబడుతుందని తెలిపారు. మోడీ అధికారం లోకి వచ్చిన తరవాత 5 లక్షల చిన్న, మధ్య తరహ పరిశ్రమలను మూసేశారన్నారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు, మైనింగ్‌ల దోపిడీని ఏజెన్సీ ప్రాంతంలో పాలకులు సాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగనన్న వివిధ ప్రభుత్వ శాఖలో ఖాళీ ద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 56వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్లు అల్లూరిజిల్లాలో ఆదివాసీ యువతకు 10 పోస్టులు కూడా రావన్నారు. గిరిజన సంఘం నిర్వహించిన పోరాట ఫలితంగా 2019 సంవత్సరంలో 1495 పోస్టులను మంజూరు చేస్తూ జీవో 10 ని నాటి తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి భర్తీ చేయలేదన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి పి. బాలదేవ్‌ మాట్లాడుతూ ఆదివాసీ ఎమ్మేల్యే, ఎంపిళష్ట్ర టికెట్‌ కోసం ఆదివాసీ సమాజానికి జరుగుతున్న అన్యాయంపై నోరుమెదపలేదన్నారు. ఆదివాసీ యువత కదలాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు కృష్ణారావు, సురేష్‌, కొండలరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కె.జీవన్‌, కార్యదర్శి చిన్నారావు, ఆదివాసి మాతృ భాష నేటివ్‌ స్పీకర్స్‌ నాయకులు సర్బు నాయుడు, చిట్టి బాబు, చంద్రయ్య, వీరయ్య, నిరుద్యోగులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

➡️