కట్టుదిట్టమైన భద్రత నడుమ పర్యటనప్రజాశక్తి- తిరుమల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుమలలో వేంకటేశ్వర స్వామిని షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం దర్శించున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన మోదీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాని కొద్దిసేపు ఆలయంలో గడిపారు. ఆ తర్వాత ఆలయ పండితుల నుంచి వేద ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈసందర్భంగా అర్చకులు మోడీకి అందజేశారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన మోడీకి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మహాద్వారం దగ్గర ఘనస్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్, ఈఓ ధర్మారెడ్డి శ్రీవారి పట్టువస్త్రంతో ప్రధానిని సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి చిత్రపటం, 2024 టీటీడీ క్యాలెండర్, డైరీలను టీటీడీ అధికారులు మోదీకి అందజేశారు. షెడ్యూల్ సమయం కంటే అర్థగంట ముందే మోడీ శ్రీవారిని దర్శించుకొని అతిధిగహం చేరుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి వచ్చారు.మోడీకి సాదర వీడ్కోలు.. తిరుమల, తిరుపతి పర్యటన అనంతరం తిరుగు పయనమైన ప్రధాని మోడీకి సాదర వీడ్కోలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్‌రెడ్డి, డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి, జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి సాదర వీడ్కోలు పలికారు. తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి మోడీ ప్రత్యేక నావికాదళ విమానంలో బయలుదేరారు. మోడీ కోసం ట్రాఫిక్ జామ్‌తిరుపతి సిటీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కోసం తిరుపతి పోలీసులు ప్రదర్శించి, సుమారు రెండున్నర గంటలకు పైగా నగరంలో ట్రాఫిక్‌ను స్తంభింప చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం, ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఈసందర్భంగా తిరుపతి నగరంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్కును స్తంభింప చేశారు. తిరిగి సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉండగా, ఉదయం 7.45 గంటల నుంచి అలిపిరి కపుల్ తీర్థం, కొర్లగుంట రోడ్డు, లీలామహల్ జంక్షన్ ఎస్వి జూపార్క్ చెర్లోపల్లి రోడ్డు, రుయా హాస్పిటల్, తదితర ప్రాంతాలలో వాహనాలు వెళ్లలేకుండా, పోలీసుల అడ్డుకున్నారు. సుమారు 10.30గంటల కి ట్రాఫిక్‌ను వదలడంతో కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. ఉదయం 9 గంటలకు కాలేజీలు, స్కూల్స్‌కు వెళ్లాల్సిన విద్యార్థులు, విధులకు హాజరవుతున్న ఉద్యోగులు అవస్థలు పడ్డారు. అదే సమయంలో తిరుపతిలో జోరున వర్షం రావడంతో వాహనదారులు వర్షంలో తడుస్తూనే వేచి ఉండడం గమనార్హం.శ్రీవారి ఆలయాన్ని రక్షించండి : రమణ దీక్షితులు తిరుమల: తిరుమల క్షేత్రం హిందుయేతర ప్రభుత్వం కబంధహస్తాల్లో ఉందని శ్రీవారి ఆలయాన్ని రక్షించాలని ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై ప్రధానమంత్రికి శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షుతులు ఫిర్యాదు చేశారు. క్రమపద్ధతిలో హిందూ దేవాలయాలను, పురాతన సంప్రదాయాలు, నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని అన్నారు. ఇంతకాలం హైందవ సనాతన ఆస్తిగా టీటీడీలో అంతర్భాగంగా ఉన్న ఆలయ సంపదను నామరూపాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. దయచేసి తిరుమల క్షేత్రాన్ని రక్షించంచి వెంటనే తెలుగునెలపై హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలని ట్విట్టర్‌లో కోరారు.