సిహెచ్‌డబ్ల్యుల సమస్యలను పరిష్కరించాలి

ప్రజాశక్తి -పాడేరు: తమను ఆశా వర్కర్లుగా మార్చాలని డిమాండ్‌ చేస్తూ అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ ముందు కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు (సిహెచ్‌డబ్ల్యులు) నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం 3వ రోజు కోనసాగాయి. ఈ రిలే నిరాహార దీక్షలను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్‌.సుందరరావు మాట్లాడుతూ, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, సిహెచ్‌డబ్ల్యులకు 4వేలు ఇస్తే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఇటువంటి వ్యత్యాసం లేదని అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 750 మంది కమ్యూనిటీ వర్కర్లకు ఈ వ్యత్యాసం ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అనేక మార్లు ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి కోరినా కనీసం స్పందించలేదన్నారు. ఇచ్చే వేతనం కూడా ప్రతి నెల చెల్లించ లేదని, ఒకవైపున ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. సిహెచ్‌డబ్ల్యులకు యూనిఫాం, సెల్‌ ఫోన్లు, మెడికల్‌ కిట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి వై.మంగమ్మ, ఉపాధ్యక్షులు దాసమ్మ, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల సంఘం నేతలు కిల్లో పార్వతమ్మ, టి.మోదకొండమ్మ. జె.సావిత్రి, కాంతమ్మ, నాగమణి, చిన్ని, లక్ష్మి పాల్గొన్నారు.

➡️