తాడిపర్రులో 200 మందిపై కేసులు నమోదు

Nov 30,2023 13:46 #Crimes in AP, #East Godavari
200 police case register

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని తాడిపర్రు గ్రామంలో 144 సెక్షన్ ఉల్లంఘించి, రోడ్డును అడ్డగించిన ఇరు సామాజిక వర్గాల వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 200 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ కె రామారావు తెలిపారు. వీరిలో ఒక సామాజిక వర్గానికి చెందిన 100 మంది మహిళలు, పురుషులపై నెం.187/2023, సెక్షన్లు 341, 188, 153(A)(1), 143, 147, రెడ్ విత్ 149, ఒక సామాజిక వర్గానికి చెందిన 100 మంది మహిళలు, పురుషులపై నెం.188/2023 సెక్షన్లు 341, 188, 153(A)(1), 143, 147, రెడ్ విత్ 149 లతో పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇటీవల తాడిపర్రులో అనధికారకంగా ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు గురించి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, గ్రామంలో 144 సి.ఆర్.పి.సి. సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ, రెండు వర్గాల ప్రజలు 144 ఉల్లంఘించి, రోడ్లు అడ్డగించి, అక్రమ సంఘం ఏర్పడి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా చట్టానికి లోబడి ఉండాలని, చట్టాన్ని అతిక్రమిస్తే తగిన శిక్ష అనుభవిస్తారని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు. గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున నలుగురు లేదా అంతకన్నా ఎక్కువమంది గుమిగూడినా, కలిసి ఉన్నా, అక్రమ సంఘం ఏర్పడినా, రోడ్లు పైకి చేరినా, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొవ్వూరు ఆర్డీవో వద్ద ఉన్న 107 సి.ఆర్.పి.సి. ఉల్లంఘించినందుకు కూడా తగిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే పోలీసులకు తెలియజేయాలనీ, ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోరాదన్నారు.

తాజా వార్తలు

➡️