ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ విషయమై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు మౌనం వీడాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ, నాయకులు జె.రామకృష్ణ అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 1013వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ ఎంఎంఎస్‌ఎం, ఎస్‌టిఎం విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను అడ్డంపెట్టుకొని స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం త్వరితగతిన కర్మాగారాన్ని మూసేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఉత్పత్తికి కావలసిన ముడి సరుకును కొనుగోలు చేయకపోవడం వంటి చర్యలు దీనిలో భాగమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీల ఒత్తిడితో ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ అంశంలో వెనుకడుగు వేస్తోందని, మన రాష్ట్రంలో మాత్రం దీనికి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. రాజకీయ పార్టీలు సరిగా స్పందించకపోవడమే దీనికి కారణమని అన్నారు. దీక్షల్లో ఉక్కు కార్మికులు ధర్మారెడ్డి, దేవుడు, డి.రమేష్, ఐవిఎస్‌ఎస్.వర్మ, రాజేశ్వరరావు. ఎన్.సింహాద్రి, రామరాజు, నాయుడు, గుమ్మడి నరేంద్ర పాల్గొన్నారు.