ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె

Nov 20,2023 16:38 #Dharna, #municipal workers
  • ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ హెచ్చరిక
  • నిరసన దీక్షను ప్రారంభించిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరావమ్మ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని వాగ్దానం చేయడమే కాకుండా, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని వైసిపి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిందని దాన్నే అమలు చేయాలని గత నాలుగున్నర సంవత్సరాలుగా శాంతియుతంగా మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం పెడచెవిని పెడుతుందని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) విజయనగరం జిల్లా బాధ్యులు ఏ .జగన్మోహన్రావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం, మంగళవారం కలెక్టరేట్‌, మున్సిపల్‌ ఆఫీసుల వద్ద మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నామని, ప్రభుత్వం స్పందించకుంటే తప్పనిసరి పరిస్థితులలో కలిసివచ్చే సంఘాలతో డిసెంబర్లో నిరవధిక సమ్మెకు సిద్ధం కాబబొతున్నామని తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద జరిగిన నిరసన దీక్ష ను సి ఐ టి యు రాష్ట్ర కార్యదర్శి కె .సుబ్బరావమ్మ ప్రారంభిస్తూ మున్సిపల్‌ కార్మికులు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కావు, తమ ప్రాణాలను పణంగా పెట్టి పట్టణాలను పరిశుభ్రం చేసి ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలబడుతున్నారన్నారు. కరోనాలో ప్రజల ప్రాణాలను కాపాడింది మున్సిపల్‌ కార్మికులేనని , వారు ఆ విధమైన కషి చేయకుంటే ప్రజల పరిస్థితి ఏమౌనో ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. వైసిపి వచ్చాక మున్సిపల్‌ కార్మికుల పరిస్థితి పోయి లో నుంచి పెనం మీద పడినట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కాంటాక్ట్‌ కార్మికుల్ని అవుట్సోర్సింగ్‌ కార్మికులుగా మార్చి ద్రోహం చేస్తే జగన్మోహన్‌ రెడ్డి ఔట్సోర్సింగ్‌ కార్మికులను ఆప్కాష్‌ లో చేర్చి నయవంచన చేశారని మండిపడ్డారు. మున్సిపల్‌ కార్మికులు ఉద్యోగులని చెప్పి సంక్షేమ పథకాలు కోతపెట్టారని, ఉద్యోగులకు ఇచ్చే ఒక్క బెనిఫిట్స్‌ వీరికి అమలు కావడం లేదు అన్నారు. పర్మినెంట్‌, సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం మున్సిపల్‌ కార్మికుల చేస్తున్న పోరాటాన్ని సిఐటియు బలపరుస్తుందని తెలిపారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే సురేష్‌ మాట్లాడుతూ థర్డ్‌ పార్టీ విధానం రద్దుచేసి నేరుగా కార్మికుల అకౌంట్లో జీతాలు వేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి క్లాప్‌ వాహనాలను కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. డ్రైవర్లకు 18500/- ఇస్తామని చెప్పి 12000/- లోపు చెల్లిస్తున్నారనీ , నెల్లిమర్ల, ముసిడిపల్లి, రామ తీర్థాలు పంప్‌ హౌస్‌ కార్మికులకు మెన్‌, మెటీరియల్‌ వేరు చేయకపోవడంతో కార్మికుల తీవ్రంగా నష్టపోతున్నారని, కనీస వేతనాలు అమలు కావడం లేదు, నెల తరబడి జీతాలు చెల్లించడం లేదని మండి పడ్డారు. సిఐటియు శ్రామిక మహిళా నాయకురాలు బి .సుధారాణి మాట్లాడుతూ మున్సిపాలిటీ లో పనిచేస్తున్న మహిళా కార్మికులు తీవ్ర పని ఒత్తిడికి, వేధింపులకు గురవుతున్నారని, కాలువల తీయించడం, చెత్త బళ్ళు ఎక్కించడం , పుస్కాట్లు తోయించడం వంటి బరువైన పనులు చేయించడంతో వేగంగా అనారోగ్యాలు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యం వస్తే పట్టించుకునే నాధుడే లేడని వైద్యం కోసం ఈఎస్‌ఐ,పిఎఫ్‌ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. నిరసన దీక్షకు కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్‌, పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు, ఎపి మెడికల్‌ రిప్స్‌ రాష్ట్ర కార్యదర్శి యూఎస్‌ రవికుమార్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. రాంబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టీవీ రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాస్‌ మద్దతు తెలియజేశారు. నిరసన దీక్షలో గౌరీ, భాస్కర్‌ రావు, ఆదినారాయణ, బాబురావు, చందర్రావు, లక్ష్మి, దుర్గారావు, పైడ్రాజు,రాఘవ, వంశీ, శ్రీను, రామారావు, రజిని తదితరులు పాల్గొన్నారు.

➡️