వరి పంటపై ఏనుగుల దాడి- వ్యవసాయ బోరు పరికరాలు ధ్వంసం

Nov 27,2023 09:09 #Crop Damage, #Paddy

ప్రజాశక్తిా సోమల (చిత్తూరు జిల్లా) చిత్తూరు జిల్లా సోమల మండలంలోని పేటూరు గ్రామానికి చెందిన చిట్టి అనే రైతుకు చెందిన వరి పంటను ఏనుగులు తొక్కి ధ్వంసం చేశాయి. కనిగలచెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు శనివారం అర్ధరాత్రి సమయంలో చిట్టి అనే రైతుకు చెందిన రెండు ఎకరాల వరి పొలాన్ని తొక్కి ధ్వంసం చేశాయి. దీంతో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పండించిన పంట చేతికందే సమయంలో ఏనుగులు తొక్కి నాశనం చేయడంతో పంటనష్టం, అప్పులే మిగిలాయని వాపోయారు. వ్యవసాయ బోరు మోటారు, పరికరాలను కూడా ధ్వంసం చేశాయని, ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు కోరారు. ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయని, అటవీశాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. తరచూ ఏనుగుల రావడం పంటలు, గ్రామాలపై దాడులు చేయడం పరిపాటిగా మారిందని, పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోందని, ఇప్పటికైనా ఏనుగులు గ్రామాల్లోకి రావడాన్ని నివారించాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

➡️