ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌మహిళలు, విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నారాయణ విద్యాసంస్థల కోర్‌డీన్ లింగేశ్వర్‌రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంగప్ప, అబ్దుల్లా మాట్లాడారు. విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి వారిని లైంగికంగా వేధించడం దుర్మార్గమన్నారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజాప్రతినిధుల అండ, డబ్బు ఉంటే ఏం చేసినా చెల్లుతుందా? అని పోలీసులను ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, ఎస్‌పి వెంటనే స్పందించి లింగేశ్వర్‌రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. విద్యార్ధులకు, మహిళలకు విద్యాసంస్థల్లో రక్షణ కల్పించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షులు అమర్, నగర ఉపాధ్యక్షులు భాస్కర్, సహాయ కార్యదర్శి మల్లేష్, నగర నాయకులు తేజ, యోగి, మధు పాల్గొన్నారు.