ప్రజాశక్తి – నెల్లూరుప్రజారోగ్య పరిరక్షణ కోసం తమ ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టి పనిచేస్తున్న తమను తక్షణమే పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. తమను పర్మినెంట్ చేసేలా కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో శనివారం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ పోరాటానికి సిపిఎం మద్దతు తెలిపింది.కౌన్సిల్ తీర్మానం చేసే విషయంలో నగర మేయర్ హామీ ఇవ్వకపోవడంతో కార్పొరేషన్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వారికి, పోలీసులకు మధ్య తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా ఎపి మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఆర్భాటంగా సిఎం జగన్ హామీలు గుప్పించారని, అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీని నెరవేర్చలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్కాస్ వంటి వ్యవస్థను తీసుకు వచ్చి 60 ఏళ్లు నిండిన కార్మికులందరికీ ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా అర్ధాంతరంగా ఇళ్లకు పంపడం దారుణమన్నారు. మున్సిపల్ కార్మికుల పోరాటానికి జనసేన మద్దతు ప్రకటించింది. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు రూరల్ కార్యదర్శి బత్తల కృష్ణయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పెంచల నరసయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.