హమాలీలకు దుస్తులను పంపిణీ చేస్తున్న బీసీ రాజారెడ్డి
– మాజీ సర్పంచి బీసీ రాజారెడ్డి
ప్రజాశక్తి – బనగానపల్లె
హమాలీలతో బీసీ కుటుంబానికి ఆత్మీయ అనుబంధాలు ఉన్నాయని బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని బిసి గుర్రెడ్డి కాలనీలోని ప్రియదర్శిని ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి తల్లిదండ్రులు కీ.శే. బిసి గుర్రెడ్డి, బిసి లక్ష్మమ్మ దంపతుల జ్ఞాపకార్థం ఉచితంగా హమాలీలకు రూ. 70 వేలు విలువ చేసే దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తనతోపాటు తన కుటుంబ సభ్యులు ఎన్నో సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 1992లో మొదలైన సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు కొనసాగుతున్నాయని తెలిపారు. 1992లో బనగానపల్లె పట్టణంలో కరువు పరిస్థితులు ఏర్పడి తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ సమయంలో తమకున్న 10 ఎకరాల తోటను బీడు పెట్టి పట్టణ ప్రజలకు తాగునీటిని అందించామని చెప్పారు. ఆ సమయంలో తమ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారని తెలిపారు. ప్రస్తుతం తమ తల్లిదండ్రులు తమ మధ్య లేకపోయినా వారి జ్ఞాపకార్థం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా హామాలీలు నిరంతరం శ్రమిస్తూ ఉంటారని, వారిని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం బీసీ రాజారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. బిసి రాజారెడ్డి తల్లిదండ్రులు జీవించి ఉంటే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి సంతోషించే వారని తెలిపారు. వారి పేరు మీద భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో విజయ క్లాత్ స్టోర్ యజమాని రాము, హమాలీలు పాల్గొన్నారు.