కులదురహంకార దుర్మార్గ భావజాలానికి, పెత్తందార్ల దౌర్జన్యకాండకు రాష్ట్రంలో మరో దళితుడు బలైపోయాడు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని దొమ్మేరు గ్రామంలో అధికార పార్టీ ఆధిపత్య సామాజిక తరగతుల ముఠా ఘర్షణలకు అమాయక దళిత యువకుడైన బొంతా మహేంద్ర ప్రాణాలు కోల్పోవాల్సిరావడం బాధాకరం. అధికార పార్టీ స్థానిక పెత్తందారీ నేతలు, పోలీసులు వేధింపులే మహేంద్రను ఆత్మ’హత్య’ చేసుకునేలా ప్రేరేపించాయన్నది స్పష్టం. ఆత్మహత్యకు ఉసి కొల్పడం కూడా హత్యతో సమానమే. గత ఎన్నికల్లో హోంమంత్రి తానేటి వనిత విజయం కోసం మహేంద్ర అహర్నిశలు కృషి చేశారని, పోలీసులు వేధిస్తున్నారని మొరపెట్టుకున్నా అమాత్యులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బాధితుని కుటుంబ సభ్యులు వాపోతుంటే ఆ దయనీయ దుస్థితిని చూసినవారెవ్వరికైనా కన్నీళ్లు ఆగవు. శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన రాష్ట్ర హోంమంత్రి ఇలాకలోనే దళితుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ఇక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో పెత్తందారీ దౌర్జన్యాలకు బలైపోతున్న అణగారిన ప్రజల అరణ్య రోదనలు పట్టించుకునేదెవరు ?
దేశాధ్యక్ష పదవి అయిన రాష్ట్రపతి పీఠంపైనే దళిత, గిరిజన నేతలను కూర్చొబెట్టామని, ఇంతకంటే దళితోద్ధరణ, గిరిజనోద్ధరణ ఉంటుందా? బడుగుజీవులకు ఇంతకుమించి కావాల్సిందేముంటుంది? అంటూ కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు, దానికి వంతపాడుతున్న వైసిపి లాంటి ఎన్డీయేతర పాలకులు మోసపూరిత చర్యలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. వీరి నయవంచక విధానాల మాటున బొంతా మహేంద్రలాగో, వేముల రోహిత్ మాదిరో, సత్యంబాబులాగో, అనంతబాబు కారుడ్రైవర్ తరహాలోనో ఆసేతుహిమచలం అణగారిన జనం అనునిత్యం అకృత్యాలకు, అమానవీయ దాడులకు బలైపోతూనేవున్నారు. స్వతంత్ర భారత అమృతోత్సవాల వేడుకల్లో అమృత ఫలాలన్నీ పెత్తందారీ తరగతులకే పరిమితమై..నిరుపేదలకు కారుచీకట్లు, కన్నీటి కడగండ్లే మిగులుతున్నాయంటే పాలకులు అవలంభిస్తున్న దగాకోరు విధానాలే కారణం. అణగారిన జనాలకు చెందిన నేతల్లో ఒకరిద్దరికి పదవులు ఎరవేసి నిరుపేదలను మొత్తంగా వంచిస్తుండటం ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఎస్సీ వర్గీకరణపై నోరుమెదపని మోడీ సర్కార్.. ఇప్పుడు ఆ సామాజిక తరగతికి చెందిన అగ్రనాయుకుడిని పంచన చేర్చుకొని ఓదార్చి ‘ఇదిగో వర్గీకరణకు కమిటీ వేసేస్తున్నాం’ అంటూ నాటకరంగాన నంది పురస్కార సమానమైన నటనతో రక్తికట్టించింది.
మనుధర్మ వర్ణసిద్ధాంతాన్ని ఒళ్లంతా పులుముకున్న కాషాయ కూటమి కుట్రలకు వేర్వేరు కారణాలతో పలు ప్రాంతీయ పాలక పార్టీలూ జీ హూజూర్ అంటుండడం సిగ్గుచేటు. టిడిపి అధినేత చంద్రబాబు గత ఎన్నికల వేళ ‘దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’ అంటూ వ్యాఖ్యానించడంతో అప్పటికే అన్యాయానికి గురయ్యామని భావించిన దళితులు గంపగుత్తగా వైసిపి వైపు మళ్లారు. పాలకులు అయితే మారారు కానీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదన్న వాస్తవాన్ని గ్రహించేలోపే మళ్లీ ఎన్నికలొచ్చేశాయి. ఇప్పటికీ ‘నా ఎస్సీ, నా ఎస్టీ..’ అని తన ప్రసంగాల్లో ముఖ్యమంత్రి జగన్ దట్టిస్తూనేవుంటారు. కానీ దళిత కారుడ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్‌పై ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును తన వెనుకే తిప్పుకుంటున్నారు. దీనిద్వారా ఏం సంకేతం ఇవ్వదలచుకున్నారు? దళితులపై మాటల్లో ప్రేమ కురిపిస్తే సరిపోదు. ఆచరణలోనూ ఆదరాభిమానాలు చూపించాలి. అంతేకాని అడుగడుగునా పోలీసు పహారాలో అడుగులేస్తూ సమస్యలపై గళమెత్తినవారిని అణిచేస్తూ, వేధింపులకు గురిచేస్తూ పెత్తందారీ పోకడలతో పాలన సాగిస్తామంటే జనం హర్షించరు. ప్రజాసంక్షేమాన్ని, అణగారిన జనోద్ధరణను కోరుకుంటున్నామని చెప్పే నాయకులకూ ఇది తగని పని. ఇప్పటికైనా దళితులపై జరుగుతున్న దాడుల నివారణకు గట్టి చర్యలు చేపట్టాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. అనునిత్యం అకృత్యాలకు బలైపోతున్నవారికి ఆర్థిక సాయం చేసి చేతులు దులిపేసుకోకుండా వారి మనుగడకు, బతుకుదెరువులకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలి.