గ్రామీణ భారతావనికి జీవగర్రగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనునిత్యం కుయుక్తులు పన్నుతూనేవుంది. దేశమంతటా పల్లెసీమల్లో ఈ చట్టం కింద అమలౌవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల తీరుతెన్నులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2013 సంవత్సరం తర్వాత ఆడిటింగ్ నిర్వహించింది లేదని మీడియాలో కథనాలు రావడం ఆందోళన కలిగిస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి చట్టానికి ఉరితాళ్లు పేనుతూ వస్తున్న మోడీ సర్కార్ బడ్జెట్‌లో కోతలు విధించడం, యాంత్రీకరణ పెంచడం, కాంట్రాక్టీకరణకు పచ్చజెండా ఊపడం వంటి అనేక కుట్రలకు తెరలేపింది. దీంతో బిజెపి ఏలుబడిలో ఉపాధి పనుల్లోనూ అవినీతి ఆక్టోపస్‌లో విస్తరిస్తోంది. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అంటే డబుల్ ఇంజిన్ సర్కార్లున్నచోట ఈ అవినీతి జాఢ్యం మరింతగా వేళ్లూనుకుంటోంది. గ్రామీణ ఉపాధిపై కాగ్ గనుక పనితీరు మదింపు (ఫెర్మార్మెన్స్ ఆడిటింగ్) నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలన్నీ వెలుగులోకి వస్తాయి. అందుకే ఫెర్మార్మెన్స్ ఆడిటింగ్ చేయనీయకుండా అటకెక్కించేశారన్న విమర్శలను కొట్టిపారేయడానికి వీల్లేదు.
గ్రామీణ ఉపాధి హామీ పథకంపై చివరిగా 2013లో ఫెర్మార్మెన్స్ ఆడిటింగ్ జరిగింది. బిజెపి అధికారంలోకి వచ్చాక ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా ఫెర్మార్మెన్స్ ఆడిటింగ్ జరగ లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఆయా రాష్ట్రాల్లో సామాజిక మదింపు (సోషల్ ఆడిటింగ్) నిర్వహిస్తారు. ఈ విషయంలో వందకు వంద శాతం ఆడిటింగ్ నిర్వహించి కేరళ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం 6 రాష్ట్రాలు మాత్రమే 50 శాతం, అంతకు మించి ఆడిటింగ్ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయనందునే గ్రామీణ ఉపాధిపై సామాజిక మదింపు సాధ్యపడలేదన్నది రాష్ట్రాల వాదన. కాగ్ జాతీయ స్థాయిలో నిర్వహించే ఫెర్మార్మెన్స్ ఆడిటింగ్ దీనికి భిన్నమైనది. సాధారణ ఆడిటింగ్ అనేది కేవలం ఈ పథకంలోని లావాదేవీలకు మాత్రమే పరిమితమైనట్టిది. ఫెర్మార్మెన్స్ ఆడిట్ అనేది సమగ్ర మదింపు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు, పథకం అమలులో కేంద్ర విధానపర చర్యలు, వాటి పనితీరు కొలబద్ధగా సమగ్ర మదింపు ఉంటుంది. కేంద్రం సంబంధిత పథకం నిర్వహణలో ఏపాటి పనితీరును కనబర్చిందో ఫెర్మార్మెన్స్ ఆడిట్‌లో తేలితుంది. ఉపాధి పథకానికి గోతులు తవ్వుతున్న మోడీ సర్కార్‌కు సమగ్ర ఆడిటింగ్‌పై శ్రద్ధ ఎందుకుంటుంది? 2016లో మాత్రం రాష్ట్రాలు నిర్వహించిన సామాజిక మదింపు యూనిట్లను సమీక్షించే నిమిత్తం సాధారణ ఆడిట్‌కు కాగ్ ఉపాధి పథకాన్ని ఎంచుకుంది. ఆ మదింపు వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదు. మోడీ సర్కార్ ఉపాధి హామీ పథకం పట్ల ఎంతటి కుట్ర సాగిస్తోందో దీనినిబట్టే అర్థమవుతుంది.ఈ ఏడాది వర్షాకాల పార్లమెంటు సమావేశాల సందర్భంగా కాగ్ 12 నివేదికలు సమర్పించింది. వివిధ పథకాల్లో మోడీ సర్కార్ అవినీతి బండారాన్ని, అక్రమాల గుట్టును ఆ నివేదికలు రట్టు చేశాయి. మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు, ఆయుష్మాన్ భారత్ పథకాల్లోనూ రూ.కోట్ల మేర అవినీతి బాగోతాన్ని బట్టబయల్జేయడంతో కేంద్రాన్ని కాగ్ ఇబ్బందుల్లో నెట్టేసింది. దీంతో ఆగ్రహించిన మోడీ సర్కార్ సదరు ఆడిట్‌లో పాలుపంచుకున్న అధికారులపై బదిలీ వేటు వేసి కక్ష తీర్చుకుంది.
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన ఉపాధి హామీ పథకానికి చట్టం ప్రకారం పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే. క్షేత్రస్థాయిలో పనులను రాష్ట్రాలు పర్యవేక్షిస్తాయి. కానీ నిధుల విడుదలలో కేంద్రం అంతులేని నిర్లక్ష్యం చూపుతోంది. ఉపాధి కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలకు సంబంధించిన నిధులను కూడా ఇవ్వడం లేదు. 18 రాష్ట్రాలకు వేతన బకాయిలు చెల్లించాల్సివుందని గత ఆగస్టులో కేంద్ర ప్రభుత్వమే నిస్సిగ్గుగా పార్లమెంటుకు నివేదించింది. పశ్చిమ బెంగాల్‌కు రూ.2770 కోట్లు, రాజస్థాన్‌కు రూ.979 కోట్లుకు, బీహార్‌కు రూ.669 కోట్లు చొప్పున కేంద్రం నుంచి బకాయిలు రావాల్సివుంది. కానీ మోడీ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. కోవిడ్ మహామ్మారి తర్వాత ఉపాధి హామీ పథకంపై ఆధారపడుతున్నవారి సంఖ్య అనేక రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. ఉపాధి హామీకి సమాధి కట్టాలని చూస్తున్న బిజెపిని ఇంటికి పంపితేనే గ్రామీణ భారతావనికి ఉపాధి భరోసా !