ప్రజాశక్తి- తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా డిసెంబర్ 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పది రోజులపాటు భక్తులకు కల్పించనున్న వైకుంఠ ద్వారదర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల్లో సిబ్బంది అప్రమత్తంగా పనిచేసేలా అధికారులు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. నిఘా, భద్రత అధికారులు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలతో పాటు, తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటుచేయనున్న సర్వదర్శనం కౌంటర్ల వద్ద భద్రత, భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజులపాటు రద్దు చేసినట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు మినహా ఇతరుల నుండి ఈ పది రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని వెల్లడించారు. భక్తులు క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నామని తెలియజేశారు. ఇందులో భాగంగా 2.25 లక్షల రూ.300లు ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు నవంబరు 10న విడుదల చేశామన్నారు. తిరుపతిలోని సర్వదర్శనం కౌంటర్లలో డిసెంబరు 22 నుండి మొత్తం 4,23,500 టోకెన్లు మంజూరు చేస్తామని తెలిపారు. భక్తుల కోసం రోజుకు 7 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 6 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కల్యాణకట్టల్లో తగినంతమంది క్షురకులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. శ్రీవారి ఆలయం, ఇతర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలన్నారు. భక్తులకు సేవలందించేందుకు తగినంతమంది శ్రీవారిసేవకులను ఆహ్వానించాలని సూచించారు. సమీక్షలో టీటీడీ జెఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.