మట్టి అమ్ముకుని గుంతలు మిగిల్చారు

Nov 20,2023 00:14 #Tirupati district

 

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: మట్టిని దోచుకుని, రూ.5 కోట్లు కొల్లగొట్టి, తీరా రోడ్లలో గుంతలో మిగిల్చారంటూ స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డిపై జనసేన, టిడిపి నాయకులు విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీల అధినేతల పిలుపుమేరకు ఆదివారం ‘గుంతల ఏపీకి దారేది? అంటూ జనసేన టిడిపి నాయకులు పట్టణంలోని అక్కుర్తి రోడ్డులో నిరసన తెలిపారు. రోడ్లపై వర్షపు నీరు నిల్వ చేరిన గుంతల్లో వద్ద ఫ్లకార్డులు చేత బట్టి జగనన్న ఇదేనా నీ అభివద్ధి అంటూ ఎద్దేవా చేశారు. గుంతల రోడ్ల చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ‘గుంతల రాజ్యం ఏపీ’, ‘వ ఏపీ హేట్స్‌ జగన్‌’ పేరిట హాష్‌ టాగ్‌ లతో నిరసన తెలియజేశారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జి కోట వినుత, టీడీపీ తిరుపతి పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష తదితరులు పాల్గొన్నారు.
గూడూరు రూరల్‌: రాష్ట్రంలోని రహదారుల దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి కనువిప్పు కలిగించాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఉమ్మడిగా గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌ తెలిపారు. ఆదివారం గూడూరు – విందూరు రహదారి దుస్థితిని ప్రజలకు తెలియజేస్తూ టిడిపి, జనసేన పార్టీ నాయకులు రహదారి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌, టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.
దొరవారిసత్రం: జగన్మోహన్‌ రెడ్డి పరిపాలన కాలం ముగిస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు. ఆదివారం జనసేన మండల పార్టీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు సారధ్యంలో వేణుబాకం రోడ్డుపై గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన ఇంచార్జ్‌ ఉయ్యాల ప్రవీణ్‌, టిడిపి సూళ్లూరుపేట పట్టణాధ్యక్షులు ఆకుతోట రమేష్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు గోనుజకరయ్య, మైనార్టీ అధ్యక్షులు షబ్బీర్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️