ఆలయాల్లో చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్ట్

Nov 24,2023 12:34 #Guntur District

ప్రజాశక్తి-తెనాలి : ఒకేరోజు మూడు ఆలయాలలో చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టణ టు టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిఐ కె వెంకట్రావు వివరాలను వెల్లడించారు. మైనర్ గా ఉన్నప్పుడు నుంచి నేర ప్రవర్తన కలిగి, జల్సాలకు అలవాటు పడిన పల్నాడు జిల్లా, రాజుపాలెం మండలం, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి గోపి‌ పోలీసుల రికార్డులలో పాత నేరస్థుడు. ఈనెల 18న పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎరువులకొట్ల బజారులో ఓ బైకును అపహరించాడు. ఆ బైకుతో పట్టణంలో సంచరిస్తూ ఈనెల 22న తెల్లవారుజామున రజకచెరువు కూడలిలోని సీతారామ కళ్యాణ దేవస్థానం, ఆంజనేయ స్వామి గుళ్ళలో ప్రవేశించి హుండీలలోని రెండువేల నగదును అపహరించాడు. చోరీపై స్థానికుడు భీష్మ పాములు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పాత నేరస్తులపై దృష్టి సారించిన పోలీసులు విచారణలో తమ్మిశెట్టి గోపిని నిందితుడిగా గుర్తించారు. గోపి గతంలో మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం కేసులో జువైనల్ హోమ్ లో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాడు. అలాగే అంగలకుదురులో బైక్ అపహరణ కేసులోనూ జైలుకు వెళ్లాడు. కాకినాడలో ఓ మహిళ మెడలో గొలుసును అపహరించిన కేసులోనూ నిందితుడే. దొంగతనాల ద్వారా వచ్చిన సొమ్ముతో జల్సాలకు అలవాటు పడుతూ నేరాలకు పాల్పడుతున్నట్లు సిఐ వెల్లడించారు. అతని నుంచి పట్టణంలో అపహరణకు గురైన బైకును, రూ 520 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎస్ఐ పి నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️