ఏజెన్సీలో కానరాని పారిశ్రామిక ప్రగతి

గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస, సీతంపేట, భామిని తదితర ఏజెన్సీ మండలాల్లో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. దీంతో ఈ ప్రాంత గిరిజన యువత ఉపాధి కోసం వలస బాట పడుతున్నారు. ఈ ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పి గిరిజనులకు ఉపాధి కల్పించాలని గత కొనేళ్లు గా కోరుతున్నా ఏ ప్రభుత్వమూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో వందలాదిమంది చదువుకున్న గిరిజన నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల్లేక తీవ్ర నిరాశతో ఉన్నారు. మన్య ప్రాంతంలో పుష్కలమైన సహజవనరులు ఉన్నాయి. అధికారులు దృష్టి సారించి గిరిజనులను ప్రోత్సహించి ఉపాధి కల్పిస్తే నిరుద్యోగ సమస్య కొంతమేర తీరుతుంది. తద్వారా గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. స్థానికంగా గిరిజనులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో గుమ్మలక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన పలు పరిశ్రమలు నిర్వహణాలోపంతో మూలనపడ్డాయి. బనియన్‌ ఫ్యాక్టరీ, పట్టు పరిశ్రమ, చేపల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ఎస్‌కె పాడు నర్సరీలో మొక్కలకు అంట్లు కట్టడంపై, కొమరాడలో జీడి ప్రోసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటులో గిరిజనులకు శిక్షణతో పాటు ఉపాధి కల్పించారు. ప్రభుత్వానికి ఆదాయం, గిరిజనులకు ఉపాధితో ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. అయితే పై వాటికి రూపకల్పన చేసిన అధికారులు బదిలీలపై వెళ్లడంతో తర్వాత వచ్చిన పిఒలు పెద్దగా దృష్టి సారించకపోవడంతో రానురాను మరుగున పడ్డాయి. గతంలో పార్వతీపురం ఐటిడిఎ పిఒగా పనిచేసిన సువర్ణ పండాదాస్‌ నిరుద్యోగ మహిళలను ప్రోత్సహించేందుకు ఫ్యాషన్‌ టెక్నాలజీలో కుట్టుమిషన్‌లో శిక్షణ ఇచ్చారు. అయితే శిక్షణ అనంతరం స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో బెంగళూరు, చెన్నై వంటి దూరప్రాంతాలకు పంపించడంతో వారు ఆసక్తి చూపలేదు. మరోవైపు జీడి గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు జీడి పిక్కల ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. ఇందుకోసం జెకె పాడు, ఇరిడి, దురుబిలి, కొమరాడ తదితర గ్రామాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్ల కేంద్రాలకు భవనాలు నిర్మించారు. యంత్ర సామగ్రి కూడా కొనుగోలు చేసి సిద్ధం చేశారు. కొంత మంది జీడి రైతులను చెన్నై పంపించి ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్వహణపై శిక్షణ కూడా అందించారు. అంతా బాగానే ఉన్నా చివరి నిమిషంలో ఆయన బదిలీపై వెళ్లడంతో తర్వాత వచ్చిన అధికారులు పట్టించుకోకపోవడంతో మూలనపడ్డాయి.వేల ఎకరాల్లో చింత, జీడి సాగు…పార్వతీపురం మన్యం జిల్లాలోని ఐటిడిఎ పరిధిలోని 50 వేల ఎకరాల్లో జీడి పంట సాగులో ఉంది. గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లోనే 35 వేల ఎకరాల్లో జీడి తోటలు ఉన్నాయి. ఏటా సుమారు పది వేల క్వింటాళ్ల జీడి పంట దిగుబడి వస్తుందని అంచనా. గిరిజన రైతులు జీడి పంటపై ఎంతమేర ఆధారపడి ఉన్నారో అర్ధమవుతోంది. మరోవైపు ఐటిడిఎ పరిధిలో 40 వేల ఎకరాల్లో చింత చెట్లు ఉన్నాయి. ప్రతి ఏటా 10 వేల క్వింటాళ్ల వరకు చింతపండు దిగుబడి వస్తోంది.ఉపాధి లేక వలస బాటఏజెన్సీ ప్రాంతంలో చదువుకుని ఉన్న గిరిజన యువతీ, యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పన లేక దూర ప్రాంతాలకు వలస పట్ల పట్టాల్సి వస్తుంది. గుమ్మలక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం మూసి వేయడంతో యువత నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసే వలసలను నివారించాలి.కోలక అవినాష్‌, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి. పరిశ్రమలు ఏర్పాటు చేయాలి…. గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో జీడి, చింతపండు, కొండ చీపుర్లు ప్రాసెసింగ్‌ చేసేందుకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఉపాధి కల్పించాలి. గత కొన్నేళ్ల నుంచి ఏజెన్సీలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా నేటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. గిరిజనులకు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.నందివాడ కృష్ణ బాబుటిడిపి అరకు పార్లమెంట్‌ ఎస్‌.టి అధి కార ప్రతినిధి చేపల కేంద్రాన్ని అభివృద్ధి పర్చాలి..డుమ్మంగిలో ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంపై ఐటిడిఎ అధికారులు దృష్టి సారించి అభివృద్ధి పర్చేందుకు చర్యలు చేపట్టాలి. చేప పిల్లల ఉత్పత్తి ద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. సొసైటీలు ఏర్పాటు చేసి చేప పిల్లలను అమ్మకాలు చేపడితే ప్రభుత్వానికి లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది.పాలక క్రాంతికుమార్‌ సర్పంచి డుమ్మంగి.ప్రభుత్వమే కొనుగోలు చేయాలి…గిరిజనులు పండించే జీడి, చింతపండును ఐటిడిఎ, జిసిసి, వెలుగు ద్వారా కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. గిరిజనులు పండించే పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులు గ్రామాల్లోకి నేరుగా వచ్చి అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి.పి. తిరుపతిరావు సిపిఎం మండల నాయకులు.

➡️