ఎస్‌.కోటపై బొత్స గురి

Feb 29,2024 21:10

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఎస్‌.కోట నియోజకవర్గంపై జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేక గురిపెట్టినట్టుగా తెలుస్తోంది. విశాఖ ఎంపీగా ఆయన సతీమణి, మాజీ ఎంపీ ఝాన్సీలక్ష్మి రంగంలోకి దిగుతున్న విషయం విధితమే. ఈనేపథ్యంలో ఆ పార్లమెంట్‌ పరిధిలోవున్న ఎస్‌.కోట రాజకీయాలపై మంత్రి వ్యూహానికి పదును పెట్టినట్టుగా సమాచారం. వైసిపిలోని అసమ్మతి గ్రూపు టిడిపిలోకి జంప్‌ జిలానికీ రంగం సిద్ధమైన నేపథ్యంలో, అదే టిడిపి నుంచి కీలకనేతతో టచ్‌లోవున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో అనుకున్న ప్రకారం జరక్కపోతే వైసిపిలోకి వచ్చేయాలని, భవిష్యత్తులో సముచిత స్థానం వచ్చేలా తాను చూసుకుంటానని, అలా వచ్చేందుకు ఇబ్బంది అయితే పరోక్షంగానైనా సహకరించాలని కోరినట్టు సమాచారం. సదరు టిడిపి నేత అధిష్టానం వైఖరిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా బోగట్టా. టిడిపిలోనూ రెండు గ్రూపులు ఉన్న నేపథ్యంలో బొత్స వ్యూహానికి ప్రాధాన్యత సంతరించుకుంది. టిడిపి అధిష్టానం కూడా అభ్యర్థులను భేరీజు వేయడంతోపాటు బొత్స ప్రభావాన్ని కూడా అంచనా వేస్తోందని, అందుకే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతోందని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు టిడిపి జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను కేటాయించిన విషయం విధితమే. ఎస్‌.కోట, చీపురుపల్లి అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. చీపురుపల్లి వరకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోసం అధిష్టానం ఖాళీగా ఉంచింది. ఎస్‌.కోటలో ఇద్దరు నేతలు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి టిక్కెట్‌ ఎవరికి ఇస్తారనేదాన్ని బట్టి బొత్స వ్యూహం ఉంటుందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఈనేపథ్యంలో అందరి దృష్టినీ ఎస్‌.కోట రాజకీయాలు ఆకర్షిస్తున్నాయి.

➡️