ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.జిల్లా వ్యాప్తంగా 73 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. వీటిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 17, ఎపి అర్‌జెసి 1, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలు 4, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు 47, మోడల్ స్కూళ్ల 4 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5 తేదీ నుంచి జరిగిన ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయ్యాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు,మరుగుదొడ్లు, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యార్దులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా ఆర్టీసి బస్సులు అందుబాటులో ఉంటాయి. పరీక్ష సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. శుక్రవారం ప్రథమ సంవత్సరం పరీక్ష జరుగనుంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 20,630 మంది పరీక్ష రాయనుండగా, వారిలో బాలురు 9891 మంది, బాలికలు 10739 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 25134 మంది కాగా, వారిలో బాలురు 11872 మంది, బాలికలు 13262 మంది ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, అవకతవకలు జరగకుండా నిఘా కెమెరాలు పెట్టారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. విద్యార్దులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి, 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి లేదు.సెల్ ఫోన్లు అనుమతి లేదు పరీక్షలు రాసే అభ్యర్థులు, పరీక్షలు నిర్వహించే సిబ్బంది,ఇన్విజిలేటర్‌లు ఎవరూ పరీక్ష కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకు వెళ్లేందుకు అనుమతి లేదు. కాలేజీలో పని చేసే సిబ్బంది కూడా సెల్ ఫోన్లు వినియోగించడానికి అనుమతి లేదు. అన్ని పరీక్ష కేంద్రాలు వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
1200 మందితో పర్యవేక్షణ
పరీక్షల నిర్వహణకు 1200 మంది సిబ్బందిని నియమించారు. వారిలో ఇన్విజిలేటర్‌లు, ఇతర సిబ్బంది ఉన్నారు. మరో వైపు పర్యవేక్షణ కోసం 4 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 5 సిటింగ్ స్కాడ్ లు ,కలెక్టర్ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ పరీక్షలను పర్యవేక్షించనున్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ కలిగినా వారు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి సమస్యను చెప్పుకోవచ్చు. అందుకోసం 08922.237988, 7989728842 నెంబర్లను సంప్రదించవచ్చు.