ప్రజాశక్తి -సామర్లకోట రూరల్
మండల పరిధిలో వర్షాభావ పరిస్థితుల మధ్య ఖరీఫ్ సాగు జరిగింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ వరి పంట కోతలకు వచ్చింది. మండలంలోని వేట్లపాలెం, జి.మేడపాడు, పెదబ్రహ్మదేవం గ్రామాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమాయ్యాయి. నాలుగు రోజులుగా పంట కోతలు జరుగుతున్నప్పటికీ మండలంలో నేటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో 21 రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పటికీ 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రతి సీజన్లో ఏర్పాటు చేస్తున్నారు. 18 గ్రామాల్లో 22,364 ఎకరాల్లో రైతులు ఖరీఫ్ వరి సాగు చేశారు. ప్రభుత్వం సాధారణ వరి క్వింటాల్‌కు రూ.2153 మద్దతు ధర ప్రకటించగా, ఫైన్ రకం ధాన్యానికి రూ.2203 మద్దతు ధర ప్రకటించింది. నేడు పిబి.దేవంలో కొనుగోలు కేంద్రం ప్రారంభంశుక్రవారం మండలంలోని పెద్ద బ్రహ్మదేవం గ్రామంలోని ఆర్‌బికెలో కొనుగోలు కేంద్రాన్ని జెసి ఇలాక్కియా ప్రారంభించనున్నట్లు తహశీల్దార్ ఎస్.లక్ష్మీనరసకుమారి తెలిపారు. అలాగే సామర్లకోట టిటిడిసిలో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు మండల పరిధిలోని 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చెందిన కస్టోడియల్ ఆఫీసర్లకు, సిబ్బందికి, విఆర్‌ఒలకు ధాన్యం కొనుగోలుపై సివిల్ సప్లయీస్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు పలు ఆర్‌బికెల పరిధిలో 170 ట్రాక్టర్లను ధాన్యం తరలించేందుకు జిపిఎస్‌కు అనుసంధానం చేశామని వ్యవసాయ అధికారి ఇమ్మడిశెట్టి సత్య ప్రజాశక్తికి చెప్పారు.