మహేంద్ర మృతిని రాజకీయం చేయడం తగదు : హోం మంత్రి తానేటి వనిత

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌ : కొవ్వూరు రూరల్‌ మండలం దొమ్మేరులో జరిగిన పరిణామాలపై తనకు ఎలాంటి సంబంధం లేకున్నా కొంతమంది బొంతా మహేంద్ర మరణాన్ని స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకోవడం అత్యంత బాధాకరమని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. శుక్రవారం ఆమె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దొమ్మేరు పరిణామాలను సిఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. మహేంద్ర మరణంపై ముఖ్యమంత్రి సిఐడి విచారణకు ఆదేశించారని తెలిపారు. మహేంద్ర మరణంపై తనను నిందించడం చాలా మనస్థాపానికి గురయ్యానని తెలిపారు. మహేంద్ర మరణంలో తాను ఏ విధంగా కారకులు అవుతానని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కొనలేక జనసేన పార్టీ వారు ఇలా కుట్ర చేస్తున్నారన్నారు. నవంబర్‌ 13న జడ్‌పిటిసి బొంతా వెంకటలక్ష్మి కూడా తనతో పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారని, ఆమె భర్త నుంచి ఫోన్‌ వస్తే ఫ్లెక్సీల వివాదంలో అబ్బాయిని పోలీసులు తీసుకెళ్తున్నారని చెప్పారని వివరించారు. వెంటనే తన పిఎతో ఫోన్‌ చేయించి ఇంటికి పంపించామన్నారు. తర్వాత ఏం జరిగిందో జడ్‌పిటిసి తనకు తెలియజేయలేదన్నారు. మహేంద్ర పాయిజన్‌ తీసుకున్నారని నాయకుల ద్వారా తెలిసిందన్నారు. బొల్లినేని ఆసుపత్రి డాక్టర్‌కి తాను స్వయంగా ఫోన్‌ చేసి మెరుగైన వైద్యం అందించాలని మాట్లాడాన్నారు. విజయవాడకు తరలించిన విషయం తెలియదన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే లేనిపోని కల్పితాలతో మాట్లాడటం సరికాదన్నారు. సిఐడి విచారణతో త్వరలోనే నిజాలు అందరికీ తెలుస్తాయన్నారు.

➡️