ప్రజాశక్తి – ఏలూరు అర్బన్
స్థానిక సర్ సిఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, కాకినాడ పరిధిలోని కళాశాలల మధ్య అంతర్ కళాశాలల ఆటలపోటీలు, విశ్వవిద్యాలయ జట్ల ఎంపిక కార్యక్రమం శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ పోటీలకు ఏలూరు రేంజ్ డిఐజి అశోక్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అశోక్‌కుమార్ ప్రసంగిస్తూ క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా సర్‌సిఆర్.రెడ్డి విద్యాసంస్థల ఉపాధ్యక్షులు, ఉషా పిక్చర్స్ అధినేత డాక్టర్ వివి.బాలకృష్ణారావు ప్రసంగిస్తూ క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక ఉత్తేజాన్ని కలుగజేస్తాయని, విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియు కాకినాడ పరిధిలోని వివిధ కళాశాలల నుంచి 51 వాలీబాల్ పురుషుల జట్లు, 14 మహిళల జట్లు, 13 హ్యాండ్‌బాల్ పురుషుల జట్లు, ఏడు మహిళల జట్లు, ఎనిమిది నెట్‌బాల్ పురుషుల జట్లు, ఒక్క మహిళల జట్టు, 18 షటిల్ బ్యాడ్మింటన్ పురుషుల జట్లు, 11 మహిళల జట్లు పాల్గొంటున్నట్లు, సుమారు వెయ్యి మంది విద్యార్థులకు వసతి, భోజన సదుపాయం కళాశాల ప్రాంగణంలోనే ఏర్పాట్లు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ పోటీలను పారదర్శకంగా జరపడానికి వివిధ కళాశాలల నుంచి సుమారు 200 మంది అధికారులను ఉపయోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్‌సిఆర్.రెడ్డి విద్యాసంస్థల ఇన్‌ఛార్జి కార్యదర్శి కిలారు ప్రభాకరరావు, కరెస్పాండంట్ జాస్తి మల్లికార్జునుడు, మేనేజింగ్ కమిటీ సభ్యులు హరిరామకృష్ణంరాజు పాల్గొన్నారు.